Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాత్రికి రాత్రే శివాజీ విగ్రహం ఏర్పాటు
- ఇరు వర్గాల ఘర్షణ
- టియర్‌గ్యాస్ ప్రయోగం
అనుమతి లేకుండా రాత్రికి రాత్రే విగ్రహం ఏర్పాటు చేయడం పట్ల నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఆదివారం ఉద్రిక్తతకు దారి తీసింది. రెండు గ్రూపులు పరస్పరం నిరసనలు వ్యక్తం చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి చెదరగొట్టారు. పట్టణంలో 144 సెక్షన్ విధించారు. వివరాల్లోకి వెళ్తే.. బోధన్ పట్టణంలో సర్వాయి పాపన్నగౌడ్, చాకలి ఐలమ్మ, బసవేశ్వరుడి విగ్రహం, ఛత్రపతి శివాజీ, టిప్పు సుల్తాన్ విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ పాలకవర్గం తీర్మానం చేసింది. కాగా టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటును ఓ గ్రూపు వ్యతిరేకించడంతో విరమించుకున్నారు. కాగా అనుమతి లేకుండా ఓ గ్రూపు వారు రాత్రికిరాత్రే పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఛత్రపతి విగ్రహం ఏర్పాటు చేశారు. దాంతో మరో గ్రూపు ఆదివారం ఉదయం ఆ విగ్రహాన్ని తొలగించాలని నిరసన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో రెండు గ్రూపులు పరస్పరం ర్యాలీలు చేపడుతూ పట్టణంలోని ప్రధాన కూడళ్లకు చేరుకొని పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. పోలీసులు అందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేయగా.. కొందరు దుండగులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దాంతో పోలీసులు లాఠీచార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. అయినా వెనక్కి తగ్గకపోవడంతో టియర్‌గ్యాస్ ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమాచారం తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, సీపీ నాగరాజు, కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి, జిల్లా అదనపు లా అండ్ ఆర్డర్ డీసీపీ వినీత్ బోధన్ చేరుకుని బందోబస్తు పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. పట్టణంలో శివాజీ విగ్రహం ఏర్పాటుకు కలెక్టర్ అనుమతి గాని మున్సిపాలిటీ అనుమతి గాని లేదని చెప్పారు. అయినా కొందరు వినలేదని, దాంతో ఇరువర్గాల మధ్య వివాదం నెలకొందన్నారు. విగ్రహం ఏర్పాటుపై చోటుచేసుకున్న వివాదంపై ఉన్నతాధికారులకు నివేదిక పంపి తదుపరి చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. కాగా మున్సిపల్ సిబ్బంది శివాజీ విగ్రహానికి ముసుగు వేశారు.
బోధన్‌లో 144 సెక్షన్ అమలు
బోధన్ పట్టణంలో ఏర్పడిన వివాదం కారణంగా ముందస్తు చర్యల్లో భాగంగా 144 సెక్షన్ విధించినట్టు జిల్లా సీపీ నాగరాజు తెలిపారు. అనుమతి లేకుండా విగ్రహం ఏర్పాటు చేయడం సరికాదని, ఇరు వర్గాలకూ నచ్చజెప్పినట్టు తెలిపారు. టౌన్లో 144 సెక్షన్ అమల్లో ఉందని, ఎక్కువ మంది గూమి గూడినా, ర్యాలీలు తీసినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. బాన్సువాడ ఏసీపీ జైపాల్ రెడ్డి, బోధన్ ఏసీపీ రామారావు, పలువురు సీఐలు అదనపు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.