Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబానీ, అదానీ, టాటా ఎక్స్ప్రెస్లొస్తారు
- ఎల్ఐసీ, రైల్వే, రోడ్ల ప్రయివేటీకరణ దుర్మార్గం
- 28,29 తేదీల్లో సార్వత్రిక సమ్మెకు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు:
టీఆర్ఎస్కేవీ రౌండ్‌టేబుల్ సమావేశంలో బోయినపల్లి వినోద్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అడగనిది ఎవ్వరూ చేయరనీ, కార్మికులు తమ హక్కులు, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడాల్సిందేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ నొక్కి చెప్పారు. రైల్వే వ్యవస్థ ప్రయివేటీకరణకు పూనుకోవడం అన్యాయన్నారు. దీనిపై పోరాడకుంటే అంబానీ, ఆదానీ, టాటా ఎక్స్‌ప్రెస్ రైళ్లు వస్తాయని హెచ్చరించారు. ఎల్ఐసీ, రైల్వే, రోడ్లు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణకు, కార్మిక కోడ్లకు వ్యతిరేకంగా ఈ నెల 28,29 తేదీల్లో తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఆదివారం మంత్రుల నివాస సముదాయంలో టీఆర్ఎస్కేవీ ఆధ్వర్యంలో కార్మిక, ప్రభుత్వ రంగ సంస్థల యూనియన్ల నేతలతో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ అధ్యక్షత వహించారు. పెట్టుబడిదారులు, మల్టీనేషనల్ కంపెనీలు, ప్రపంచ బ్యాంకు చెప్పే ఆదేశాల మేరకు మోడీ సర్కారు నడుస్తున్నదనీ, అందులో భాగంగానే కార్మిక కోడ్లను తెచ్చిందని విమర్శించారు. గతంలో హెచ్‌పీ, ఐఓసీ లాంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థల ముందు రిలయెన్స్ లాంటి సంస్థలు తట్టుకోలేక మూతపడ్డాయని గుర్తుచేశారు. అదే రకంగా ఇన్సూరెన్స్ రంగంలో హెచ్డీఎఫ్సీ, బజాజ్, ఐసీఐసీఐ లాంటి పది ప్రయివేటు ఇన్సూరెన్స్ కంపెనీలు ఎల్ఐసీ సేవల ముందు నిలవలేకపోయాయన్నారు. బలంగా పోటీలో నిలబడిన ప్రభుత్వ రంగ సంస్థలను బీఎస్ఎన్ఎల్ మాదిరిగా దొంగచాటున నిర్వీర్యం చేసే కుట్రకు మోడీ సర్కారు పూనుకున్నదని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను కారుచౌకగా అమ్మేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు తీసుకుంటున్నదని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో విద్యుత్ కొరత నివారించేందుకు ఆదానీ, జిందాల్ లాంటి సంస్థల నుంచి కొనుగోలు చేయాలనే సూచన రాగా సీఎం కేసీఆర్ తిస్కరించారని గుర్తుచేశారు. రాష్ట్ర సర్కారు ప్రభుత్వ రంగంలోనే ప్లాంట్లను ఏర్పాటు చేసి విద్యుత్‌ను తయారు చేస్తున్నదని చెప్పారు. వాటికి కావాల్సిన పంపులు, మోటార్లు, టర్బన్ల ఆర్డర్లనూ బెల్ సంస్థకు ఇచ్చామని గుర్తుచేశారు.
ఏఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ సంపద ఒక దగ్గర పోగుపడకుండా చూడాలని రాజ్యాంగం చెబుతుంటే మోడీ సర్కారేమో కొందరు చేతిల్లోకే చేరేలా విధాన పర నిర్ణయాలు తీసుకుంటున్నదని విమర్శించారు. దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే చర్యలకు పూనుకున్న తీరును వివరించారు. రాష్ట్రంలో కోటి మందికిపైగా సమ్మెలో పాల్గొనేలా అందరూ కృషి చేయాలని కోరారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్ మాట్లాడుతూ..సింగరేణి, ఆర్టీసీ, బెల్, బీడీఎల్, తదితర ప్రభుత్వ రంగ సంస్థల్లో పూర్తిస్థాయిలో సమ్మె జరిగేలా టీఆర్ఎస్ సహకరించాలని కోరారు. స్కీమ్వర్కర్లందరూ సమ్మెలో పాల్గొనేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థల మనుగడే ప్రశ్నార్థకమవుతుంటే ఒక్కరోజు జీతం పోతుందనే నెపంతో కొందరు సమ్మెకు దూరంగా ఉండటం సరిగాదని సూచించారు. కార్మికుల హక్కులు, దేశ సంపదను కాపాడుకోవడం కోసం జరుగుతున్న దేశభక్తియుత సమ్మెను ప్రతిఒక్కరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్య క్షులు రాంబాబు యాదవ్ మాట్లాడుతూ..ఓ పక్క కేంద్ర ప్రభుత్వ పథకాల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను పెంచుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం తగ్గిస్తూ పోతున్నదని విమర్శించారు. ప్రయి వేటు సంస్థల్లోకి కార్మికులు సమ్మెలో పాల్గొనకపోతే రానున్న కాలంలో వాళ్లకు జరుగబోయే నష్టాలను విడమర్చి చెప్పి చైతన్యపర్చాలన్నారు. పబ్లిక్ సెక్టార్లో సమ్మె జయప్రదానికి కృషి చేస్తామని హామీనిచ్చారు. హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ..ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ, కార్మిక కోడ్ల విషయంలో కేంద్రం గుడ్డిగా ముందుకెళ్తూ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే చర్యలకు ఉపక్రమించిందని విమర్శించారు. కార్మిక సంఘాలన్నీ కలిసికట్టుగా ముందుకుసాగితే వంద శాతం సమ్మె జయప్రదం అవుతుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఐఐఈఏ హైదరాబాద్ జోనల్ ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, సౌత్‌సెంట్రల్ జోనల్ కార్యదర్శి రవీంద్రనాధ్, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర నాయకులు శ్రీను, వి.దానకర్ణాచారి, ఎల్.రూప్సింగ్, మచ్చ నర్సిం హులు, ప్రభుత్వ రంగ సంస్థల యూనియన్ల నాయకులు బి.చంద్రయ్య(ఏఐడీఈపీ), సత్తయ్య (బీడీఎల్), యాదవరెడ్డి(రైల్వే రంగం), భాస్కర్‌రెడ్డి (ఈసీఐఎల్), విజరుకుమార్(బీడీఎల్), జీవన్‌కు మార్(హెచ్ఎఎల్), సత్యనారాయణ (హెచ్ఈఎల్), జె.రాఘవరావు(బీఈఎల్), శ్రీకాంత్, వేముల మారయ్య(ట్రాన్స్‌పోర్టు రంగం) తదితరులు మాట్లాడారు.