Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్.. నీ ఫాంహౌస్‌ను కప్పేస్తాం
- దుడ్డు కర్రల సైన్యం రెడీ చేస్తా
- కేంద్రం కొనకపోతే రాష్ట్రమే కొనాలి
- ఎల్లారెడ్డి 'మన ఊరు-మన పోరు' సభలో రేవంత్‌రెడ్డి నిప్పులు
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
రైతులు పండించిన వరి ధాన్యం కొనకపోతే రాష్ట్రంలో సునామీ సృష్టిస్తామని, కేసీఆర్ ఫాంహౌస్‌ను కప్పేస్తామని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. వరి ధాన్యం కొనుగోలుకు రూ.పది వేల కోట్లు కేటాయిస్తే రాష్ట్రంలో ప్రతి గింజనూ కొనుగోలు చేయొచ్చని తెలిపారు. 'ధనిక రాష్ట్రంలో ఆ మాత్రం కేటాయింపులు చేయలేరా' అని సీఎంను ప్రశ్నించారు. రైతుల పంటలు చేతికొస్తున్న సమయంలో కొనుగోలు నుంచి తప్పించుకునేందుకు కేంద్రంపై యుద్ధం అంటూ ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని ఆరోపించారు. 'కేసీఆర్.. ప్రతిసారీ
యుద్ధం అంటూ ఉపన్యాసాలిచ్చి.. ఫాంహౌస్‌లో పంటున్నాడు' అని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని మాట తప్పిన బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఈ ప్రాంత రైతులు పాతాళంలోకి తొక్కుతారన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం 'మన ఊరు- మన పోరు' బహిరంగ సభ జరిగింది. ఈ సభకు మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ అధ్యక్షత వహించారు. ఈ సభకు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలతో పాటు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ చేపట్టారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి జాజాల సురేందర్‌ను గెలిపిస్తే గుండెల మీద తన్ని కేసీఆర్ పంచన చేరిండని విమర్శించారు. ఒక నాయకుడు పోతే వందలాది మంది నాయకులను తయారు చేసుకుంటామని తెలిపేందుకే ఈ నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేశామని చెప్పారు. షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామని, పసుపు బోర్డు సాధిస్తామని చెప్పి మాట తప్పిన కవితను.. 2019 ఎన్నికల్లో ఈ ప్రాంత రైతులు లక్ష ఓట్లతో ఓడగొట్టారని గుర్తుచేశారు. ఇక బీజేపీ ఎంపీ అరవింద్ రెండు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని, రెండేండ్లయినా తేలేదని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని రైతులు పాతాళంలోకి తొక్కుతారన్నారు. 'కేసీఆర్.. నిజామాబాద్ జిల్లాలో రైతుల భూములను పడావ్ పెట్టమంటావా? కాళేశ్వరం నీళ్లు తెచ్చినం.. 24 కరెంటు సాధించినం అని గొప్పలు చెబుతున్నావు. మరి వరి సాగు వద్దంటే కరెంటు ఎవరి ముక్కులో పెడతావ్? కాళేశ్వరం నీళ్లు ఎవరి నోట్లో పోస్తవ్' అని విమర్శిచారు. రైతుబంధు పేర రైతులకు రూ.10వేలు ఇస్తున్నామని సీఎం చెబుతున్నారని, కానీ వరి కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులకు యేడాదికి లక్ష నష్టం వస్తదని అన్నారు. వరి కొనుగోలు అంశం నుంచి రైతుల దృష్టి మరల్చేందుకే సీఎం కేసీఆర్ కేంద్రంపై యుద్ధం అంటున్నారని ఆరోపించారు. మోడీ వరి కొంటే నువ్వేం చేస్తావని, దళారి పని చేస్తావా అని ప్రశ్నించారు. ఇక్కడ రైతులు నీకు ఓటు వేసి రెండుసార్లు గెలిపిస్తే కేంద్రంపై నెపం పెడతావా అని ఆరోపించారు. ప్రతి గింజను ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు. రైతుల ధాన్యాన్ని కొనకపోతే వేలాది మంది రైతులను జమ చేసి సునామీ సృష్టిస్తామని, ఫాంహౌస్‌ను కప్పేస్తామని హెచ్చరించారు. ఇక ఖయితీ లంబాడాల తరపున కోట్లాడే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని రేవంత్‌రెడ్డి హామీనిచ్చారు. ఎల్లారెడ్డి అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు.