Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దారిపొడవునా పేదలు..
- పార్టీలకు అతీతంగా కదిలివచ్చిన నేతలు
నవ తెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం శనివారం సాయంత్రం ఆనారోగ్యం కారణంగా కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. ఆదివారం మధ్యాహ్నం సీపీఐ(ఎం) కార్యాలయానికి పార్థీవ దేహాన్ని తీసుకొచ్చారు. సుమారు 12గంటల ప్రాంతంలో ఆమె పార్థీవదేహం మర్రిగూడ బైపాస్కు చేరుకుంది. అక్కడ నుంచి పార్టీ కార్యకర్తలు, మల్లు ఆశయాలను సాధిస్తామని నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అంబులెన్స్‌లో ఉన్న ఆమెను చూసేందుకు దారిపొడవునా చౌటుప్పల్, చిట్యాలలోని పలు గ్రామాల్లో ప్రజలు అంబులెన్స్‌ను ఆపి కడసారి వీడ్కోలు పలికారు. ఒకవాహనంపై ముందుగా వస్తూ వెనుక అంబులెన్స్‌ను పెట్టి ర్యాలీగా వచ్చారు. దారిపోడవునా పార్టీ శ్రేణులు నినాదాలతో పట్టణమంతా మారుమోగింది. ఎర్రజెండా రెపరెపలు, మృతవీరుల పాటలు, ఆమె చేసిన సాయుధ పోరాటాన్ని కీర్తిస్తూ సాగిన ప్రజానాట్యమండలి పాటలు, మహిళలు, ఐద్వా నాయకురాళ్ల కోలాటం, నృత్యాలు, డప్పు చప్పుళ్లతో దద్దరిల్లింది. నల్లగొండ జిల్లా మర్రిగూడబైపాస్, వెంకటేశ్వర కాలనీ, ఎన్టీఆర్ విగ్రహం, క్లాక్‌టవర్ సెంటర్ మీదుగా సీపీఐ(ఎం) కార్యాలయానికి ఆమె పార్థీవ దేహన్ని తీసుకువచ్చారు. అప్పటికే పెద్దఎత్తున గుమిగూడిన ప్రజలు ఒక్కసారిగా నినాదాలు చేస్తూ కన్నీటిపర్యంతమయ్యారు.
పార్టీ కార్యాలయంలో ఆమె మృతదేహాన్ని పెట్టేందుకు తీసుకువస్తున్న క్రమంలో ఆమెను చూసేందుకు గుంపులు గుంపులుగా జనం పరుగెత్తారు. ఒకానొక సమయంలో పార్టీ నాయకులు పోలీసులను పిలిపించి జనాన్ని కంట్రోలు చేయాలని కోరారు. విగతజీవిగా ఉన్న మల్లు స్వరాజ్యంను చూసి కార్యకర్తలు బోరున విలపించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె చేసిన పోరాటాలు, జిల్లా అభివృద్ధిలో ఆమె చేసిన ఉద్యమాలను స్మరిస్తూ ప్రజానాట్య మండలి కళకారులు పాడిన పాటలు ప్రజలను ఎంతో ఉద్వేగానికి గురిచేశాయి. వృద్ధాప్యాన్ని లెక్కచేయకుండా ఆమెను చూసేందుకు మహిళలు కదిలివచ్చి బోరున విలపించారు. ఈ సంఘటనలు అందరిని కన్నీరు కాల్చేలా చేసింది. ఉమ్మడి నల్లగొండలో ఆమెతో కలిసి పనిచేసిన పార్టీ నాయకులు, ఇతర పార్టీలకు చెందిన నేతలు, నేరుగా పరిచయం ఉన్న సాధారణ ప్రజలు కడసారి చూసేందుకు తరలివచ్చారు. పార్టీ కేంద్ర కమిటీసభ్యులు చెరుపల్లి సీతారాములు ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన పక్కనే ఉన్న బీవీ రాఘవులు, జూలకంటి రంగారెడ్డి ఓదార్చిన కన్నీటి దారలను ఆపుకోలేకపోయారు. సాయంత్రం ఐదుగంటలకు పార్థీవదేహాన్ని జిల్లా కేంద్రంలో ఉన్న మెడికల్ కాలేజీకి అప్పగించేందుకు పార్టీ కార్యాలయం నుంచి అంతిమయాత్ర నిర్వహించారు. పెద్దఎత్తున బాంబుల మోతలు, కళాకారుల పాటలు, డప్పుచప్పుళ్లతో ర్యాలీ సాగింది. అనంతరం మెడికల్ కాలేజీ అధికారులకు మృతదేహాన్ని అప్పగించారు. ఈ ర్యాలీలో జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు డా. గాదరి కిషోర్‌కుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్, చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మేల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పాల్గొని కాలేజీకి మృతదేహన్ని అప్పగింత జరిగే వరకు ఉన్నారు.