Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భయమంటే ఎరుగని ధీరవనిత మల్లు స్వరాజ్యం
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం భౌతికకాయాన్ని నల్లగొండ సీపీఐ(ఎం) కార్యాలయానికి తీసుకొచ్చారు. అంబులెన్స్‌లో ఉన్న ఆమెను చూసేందుకు దారిపొడవునా జనమే.. చౌటుప్పల్, చిట్యాలలోని పలు గ్రామాల్లో అంబులెన్స్‌ను ఆపి కడసారి వీడ్కోలు పలుకుతూ..కన్నీరు మున్నీరయ్యారు. దారిపొడవునా పార్టీ శ్రేణుల నినాదాలతో పట్టణమంతా మారుమోగింది. ఎర్రజెండా రెపరెపలు, మృతవీరుల పాటలు, ఆమె చేసిన సాయుధ పోరాట గీతాలతో హౌరెత్తింది. కడసారి చూడటానికి రాజకీయాలకతీతంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మల్లు స్వరాజ్యం పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుంటామని ప్రతిన బూనారు.
పోరాటమే ఆమె ఊపిరి : బీవీ రాఘవులు
- కన్నీటి పర్యంతమైన చెరుపల్లి..
- నిజాయితీకి నిలువుటద్దం స్వరాజ్యం.. తమ్మినేని
నవ తెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సీపీఐ(ఎం) జాతీయ నాయకులు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం భయమంటే ఎరుగని నేత అని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జి. జగదీష్‌రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం మరణించిన మల్లు స్వరాజ్యం పార్థీవదేహాన్ని ఆదివారం నల్లగొండ జిల్లా సీపీఐ(ఎం) కార్యాలయంలో ప్రజల సందర్శనార్ధం ఉంచారు. ఆమె పార్థీవ దేహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 12న యేట నుంచి మరణించే వరకు ఆమె ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి రగిలించారని కొనియాడారు. పేదల కోసం రాజీలేని పోరాటం చేశారని గుర్తుచేశారు. మహిళల హక్కుల కోసం జరిగిన ఉద్యమంతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆమె చేసిన పోరాటం చెరగని ముద్ర వేసిందన్నారు. నమ్మిన సిద్దాంతం కోసం జీవితాంతం ముందుకు సాగిందని, ఆమెలేని లోటు జిల్లా ప్రజలకు తీరనిదని తెలిపారు. అనంతరం సీపీఐ(ఎం) పోలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మాట్లాడారు. సుమారు 70ఏళ్లు పోరాటమే
ఊపిరిగా పేదల కోసం పనిచేసిందన్నారు. ఆమె పేరు వింటే ఎక్కడలేని దైర్యం వచ్చేదని తెలిపారు. భవిష్యత్ పోరాటాలకు ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పోలిట్‌బ్యూరో సభ్యులు సుభాషిణి అలీ మాట్లాడుతూ.. ఉద్యమానికి వేగు చుక్క స్వరాజ్యమన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని, రాష్ట్రంలోనే గాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకురాలని కొనియాడారు. జాతీయస్థాయిలో మహిళ హక్కుల రక్షణ కోసం జరిగిన పోరాటంలో తనదైన శైలిలో ఉద్యమాలను నిర్వహించారని తెలిపారు. కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. ప్రజా పోరాటాలకు కేంద్రబిందువుగా నిలిచిన యోధురాలుతో కలిసి పనిచేసిన అనుభవాన్ని గుర్తుచేసుకుని కన్నీటిపర్యంతమయ్యారు. జిల్లాలో జరిగిన ప్రతి పోరాటంలో ఆమె పాత్ర అత్యంత కీలకంగా ఉందన్నారు. ఎంతో మంది నికార్సయిన కార్యకర్తలను తయారుచేసిన పోరాట దివిటి మరణం తట్టుకోలేకపోతున్నామన్నారు. ఆమె ఆశయ సాధన కోసం ముందుకు సాగుతామన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. నిజాయితీకి నిలువుటద్దంగా స్వరాజ్యం నిలిచిపోయారని తెలిపారు. ఆనారోగ్యంతో మరణించిన స్వరాజ్యంను చూసేందుకు రెండు రోజులుగా తండోపతండాలుగా జనం వచ్చారని గుర్తుచేశారు. ఎర్రజెండాకు ఓట్లు లేవు.. సీట్లు లేవు, ఇక ఆ జెండా పని అయిపోయిందని చెప్పే వాళ్లకు పోటేత్తిన జనసందోహమే సమాధానమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పార్టీ మాజీ కార్యదర్శి పి. మధు మాట్లాడుతూ.. చిన్ననాటి నుంచి పేదల కోసం ఆలోచన చేసిన గొప్ప మహిళ అని కొనియాడారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికీ ఎప్పుడూ పేదలు, కూలీల కోసం గళం విప్పిన నాయకురాలని తెలిపారు. వ్యకాస జాతీయ ఫ్రధాన కార్యదర్శి వెంకట్ మాట్లాడుతూ.. ఆమె రగిలించిన పోరాట దివిటి పేదల కష్టాలు తీరేవరకు ఆరిపోదని, ఆమె ఆశయ సాధన కోసం చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలిపారు.
పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు ఎస్ వీరయ్య మాట్లాడుతూ.. ప్రజలకు మరింత సేవ చేస్తేనే ఆమె మనస్సుకు శాంతి కలుగుతుందని అన్నారు. జీవితాంతం మహిళలు, పేదలు, కర్షకుల కోసం పనిచేసిన ఆమె మనకు ఆదర్శమన్నారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. స్వరాజ్యం తన కుటుంబాన్ని కూడా పార్టీ కోసం పనిచేసేలా తీర్చిదిద్దిందని అన్నారు. తనను కూతురి కంటే ఎక్కువగా చూసిందని, ఆమెలేని లోటు పూడ్చలేనిదని తెలిపారు. ఆమె ఆశయ సాధన కోసం చివరి వరకు పోరాడుతామని స్పష్టంచేశారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర నాయకులు నంద్యాల నర్సింహరెడ్డి మాట్లాడుతూ.. భూస్వామ్య కుటుంబంలో జన్మించినప్పటికి కష్ట జీవుల కోసం ప్రాణాలకు సైతం తెగించి పోరాటం చేశారని అన్నారు. ఆమె జీవితం నేటి తరానికి ఆదర్శమన్నారు. పేదల రాజ్యం కోసం ఆమె చూపిన మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు. మల్లు స్వరాజ్యం మృతికి ఐద్వా ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి, సీఐటీయూ జాతీయ నాయకులు సాయిబాబు, తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జాన్‌వెస్లీ, ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, యాదాద్రి జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున సంతాపం తెలియజేసి నివాళులర్పించారు.
నివాళులర్పించిన శాసనమండలి చైర్మెన్, ఎంపీ, ఎమ్మెల్యేలు..
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం మృతికి శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా పరిషత్ చైర్మెన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డా||గాదరి కిషోర్‌కుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్‌కుమార్, చిరుమర్తి లింగయ్య సంతాపం తెలియజేస్తూ ఆమె పార్థీవ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారితో పాటు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, వేముల వీరేశం, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మెన్ మందుల స్యామెల్, మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మెన్ అబ్బగోని రమేష్ తదితరులు ఉన్నారు.
మల్లుకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నివాళి..
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మరణం పట్ల సంతాపం తెలియజేస్తూ ఉపాద్యాయ ఎమ్మ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి నివాళులర్పించారు. ఆమె పోరాట స్ఫూర్తితో పేదలకు న్యాయం జరిగే వరకు పోరాడాలన్నారు.
కాంగ్రెస్ నేతల నివాళి..
మల్లు స్వరాజ్యం పార్థీవదేహంపై కాంగ్రెస్ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రులు కుందూరు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షులు శంకర్‌నాయక్, సూర్యపేట జిల్లా నాయకులు పటేల్ రమేష్‌రెడ్డి, నల్లగొండజిల్లా నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి, కొండేటి మల్లయ్య తదితరులు ఉన్నారు. జానారెడ్డి మల్లు స్వరాజ్యం అమర్హై అంటూ పిడికిలి బిగించారు. అనంతరం ఆమె పాడేను కూడా మోశారు.
బీజేపీ నేతల సంతాపం
మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం మృతికి బీజేపీ నాయకులు సంతాపం తెలిపి పార్థీవదేహానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ప్రకాష్‌రెడ్డి, గోలి మధుసూదన్‌రెడ్డి, వీరెళ్లి చంద్రశేఖర్, రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
నివాళులర్పించిన సీపీఐ నాయకులు
పేదల పెన్నిది, పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి పట్ల సీపీఐ నాయకులు సంతాపం తెలియజేస్తూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు మల్లేపల్లి ఆదిరెడ్డి, జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, జిల్లా నాయకులు ఎల్ శ్రవన్‌కుమార్, జిల్లా యాదయ్య తదితరులు ఉన్నారు.