Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రపంచ దృష్టిని ఆకర్షించిన రైతాంగ ఉద్యమానికి తలొగ్గిన మోడీ సర్కార్... ఆ ప్రభావంతో రైతులకు కొన్ని హామీలిచ్చిందని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ చెప్పారు. అయితే ఆ ఉద్యమం సందర్భంగా రైతులను కార్లతో తొక్కి చంపిన దుర్మార్గుల్ని మాత్రం కాపాడేందుకు మోడీ సర్కారు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ఇదే సమయంలో రైతులకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వాటి అమలుకు పూనుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే దేశవ్యాప్తంగా రెండో దశ పోరాటాన్ని ప్రారంభిస్తామని వారు హెచ్చరించారు.
రైతు ఉద్యమం, ఆ క్రమంలో అన్నదాతలకు ఇచ్చిన వాగ్దానాల విస్మరణ, లఖింపూర్ ఖేరి ఘటనలో దోషులకు బెయిలిచ్చి బయటకు పంపటం తదితరాంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం హైదరాబాద్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎమ్) ఇచ్చిన పిలుపులో భాగంగా నిర్వహించిన ఈ ప్రదర్శనలో సారంపల్లి, వెంకట్, సాగర్‌తోపాటు రైతు సంఘం ఉపాధ్యక్షుడు మూడ్ శోభన్ నాయక్, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్డీ అబ్బాస్, సీఐటీయూ రాష్ట్ర నాయకులు కూరపాటి రమేశ్, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్, రైతాంగ సమితి రాష్ట్ర కార్యదర్శి వెంకటయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధరలు కల్పిస్తాం, రైతు ఉద్యమంలో మరణించిన అన్నదాతల కుటుంబాలకు ఎక్స్గ్రేషియోనిస్తాం, రైతులకు రుణమాఫీ చేస్తాం తదితర వాగ్దానాలను జనవరి 15 నాటికి అమలు చేస్తామంటూ రాతపూర్వక హామీనిచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు మార్చి 15 దాటినా వాటిని అమలు చేయటం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో రెండో దశ పోరాటానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. మోడీ సర్కారు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 28,29 తేదీల్లో నిర్వహించతలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయటం ద్వారా కార్మిక, కర్షక మైత్రిని చాటి చెప్పాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.