Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భవన నిర్మాణ కార్మికుల ఐక్య సదస్సులో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కార్మిక హక్కులపై ఉక్కుపాదం మోపుతూ పోరాడి సాధించుకున్న చట్టాలను ధ్వంసం చేస్తున్న మోడీ తిరోగమన విధానాలను తిప్పి కొట్టేందుకు భవన కార్మికులు ఈ నెల 28, 29 తేదీలలో సార్వత్రిక సమ్మెను సమరశీలంగా నిర్వహించాలని భవన నిర్మాణ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నేతలు పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో మారగోని ప్రవీణ్‌కుమార్‌గౌడ్(ఏఐటీయూసీ అనుబంధం), వంగూరు రాములు(సీఐటీయూ అనుబంధం), నల్లన్న(ఐఎఫ్టీయూ), నాగేశ్వరరావు(ఐఎఫ్టీయూ అనుబంధం), రవి(స్ఫూర్తి సంఘం) అధ్యక్షతన భవన నిర్మాణ కార్మికుల సంఘాల జేఏసీ సదస్సు జరిగింది. సమ్మెలో భాగంగా 22, 23, 24 తేదీలలో జిల్లా మండల స్థాయిలో సదస్సులు, 26, 27 తేదీలలో అడ్డా ప్రాంతాల్లో, పనిచేసే ప్రాంతాల్లో కరపత్రాల పంపిణీ, స్కూటర్ ర్యాలీలతో ప్రచారం, 28న గ్రామాలు, మండలాల్లోని పని ప్రాంతాల్లో పనులు చేయటం నిలిపివేత వంటి కార్యక్రమాలను చేయాలని తీర్మానించింది. 29న కార్మిక శాఖ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ధర్నా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ఎఐసీబీసీడబ్ల్యూ జాతీయ ఉపాధ్యక్షులు ఉజ్జిని రత్నాకర్‌రావు, బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి ఆర్.కోటంరాజు, ఐఎఫ్టీయూ నేత అన్వేశ్, టీఎఫ్‌టీయూ నేత ఐలయ్య, ఐఎఫ్టీయూ నేత అనురాధ మాట్లాడుతూ.. సంస్కరణల పేరుతో చట్టాలను తిరగరాస్తూ కార్పోరేటు వర్గాలకు మోడీ ప్రభుత్వం అనుకూలంగా మారుస్తుందని ఆరోపించారు. పోరాడి సాధించుకున్న హక్కులను కేంధ్ర ప్రభుత్వం హరించివేస్తున్నదని విమర్శించారు. నిత్యావసరాల ధరలు నియంత్రించాలనీ, సామాజిక భద్రత కల్పించాలని కోరారు. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న 15 కోట్ల మంది నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సంక్షేమబోర్డును నిర్వీర్యం చేసే యత్నం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. 1979, 1996, 1998 చట్టాలను కేంధ్ర ప్రభుత్వం ధ్వంసం చేస్తుందని విమర్శించారు. ఐక్యంగా సార్వత్రిక సమ్మెను నిర్వహించి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. క్లైములు చెల్లించకుండా కార్మికశాఖ అధికారులు నిర్మాణ కార్మికులకు అన్యాయం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కుమార్, నాగేశ్వర్రావు, గన్నారపు రమేష్ కమతం యాదగిరి, పరమేశం తదితరులు పాల్గొన్నారు.