Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి సీపీఐ(ఎం) డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బల్క్ డీజిల్ ధరలు లీటరుకు రూ.25 పెంచడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఆ ధరల పెంపుతో రిటైల్ ధరలూ పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేసింది. నిత్యావసర వస్తువుల ధరలపై ఈ ప్రభావం పడుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించు కోవాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా ప్రజలపై భారాలు మోపేందుకు కేంద్రం సిద్ధమైందని విమర్శించారు. డీజిల్‌ను బల్క్‌గా కొనుగోలు చేసే వినియోగదారులకు ఒకేసారి లీటరుకు రూ.25 ధర పెంచారని తెలిపారు. రాష్ట్రాల రవాణా సంస్థలు, ప్రయివేటు బస్సు ఆపరేటర్లు, పరిశ్రమలు, సినిమాహాళ్లు, అపార్ట్మెంట్లు, కాంప్లెక్సులు తదితరాలు బల్క్ వినియోగదార్ల కేటగిరీలోకి వస్తాయని వివరించారు. బల్క్ డీజిల్ ధరలు పెరగడంతో పెట్రోల్ పంపుల దగ్గరే ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో రిటైల్ ధరలూ పెరిగి చివరికి వినియోగదారులు నష్టపోయే ప్రమాదముందని తెలిపారు. ఇప్పటికే నిత్యావసర వస్తువులు, రవాణా ఛార్జీల భారాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనీ, అందువల్ల పెంచిన బల్క్ డీజిల్ ధరలను తక్షణం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.