Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ఎదురు చూపులు
- కరోనా వారియర్ల ఉసురు పోసుకుంటున్న వైనం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వారి కరోనా వారియర్లు. మహమ్మారి కాలంలో అందరూ తలుపులు మూసుకున్న వేళ తమ ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలందించిన వీరులు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పొగడ్తలతో అందరూ వారిని ముంచెత్తారు. చప్పట్లు కొట్టారు. పూల వర్షం కురిపించారు. వారిని ప్రత్యక్షంగా కనిపించే దేవుళ్లన్నారు. వైరస్‌ను తమ కుటుంబాల వద్దకు మోసుకుపోలేక, ఇంటికి దూరంగా వైరస్‌ను తరిమికొట్టేంత వరకు అదే పనిగా సేవలందించిన ప్రభుత్వాస్పత్రుల డాక్టర్లు వారు. అలాంటి వైద్యులకు అదనపు చెల్లింపులు, ప్రోత్సాహకాలు, గుర్తింపు ఏమో గానీ కనీసం చేసిన పనికి సర్కారు జీతం చెల్లించలేదు. దీంతో ఐదు నెలల జీతం కోసం పలుమార్లు రాష్ట్ర వైద్యారోగ్య కార్యదర్శి రిజ్వీ, విద్య సంచాలకులు డాక్టర్ కె.రమేశ్ రెడ్డిలకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేదని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2021 ఏప్రిల్‌లో మెడికల్ పీజీ కోర్సు పూర్తయినప్పటికీ కోవిడ్-19 సెకెండ్ వేవ్‌లో వారి సేవలు తీసుకునేందుకు కోర్సును పొడిగించారు. తిరిగి కరోనా థర్డ్ వేవ్ మొదలు కావడంతో వారి సేవలను గతేడాది నవంబర్ నుంచి తీసుకుంటున్నారు. అయితే గతేడాది మే నెలకు
సంబంధించిన జీతంతో పాటు నవంబర్ నుంచి ఐదు జీతాలు చెల్లించలేదు. 2012 మే, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించిన జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న బోధనాస్పత్రుల్లో 700 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు పని చేస్తున్నారు. అయితే పలుమార్లు విన్నవించిన తర్వాత గత శనివారం ఐదు మెడికల్ కాలేజీలకు చెందిన వారికీ మాత్రమే, అదీ కూడా కేవలం రెండు నెలల జీతాన్నే అధికారులు చెల్లించారు.
సమ్మె తప్పదు....
పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. రెగ్యులర్ నియామకాలు చేపట్టకుండా కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసుకోవడమే కాకుండా అందులోనూ సకాలంలో జీతాలు చెల్లించకుండా అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించి వెంటనే వేతనాలు చెల్లించకుంటే సమ్మె తప్పదని హెచ్చరిస్తున్నారు.