Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఒకే దేశం- ఒకే సేకరణ..' విధానముండాలి.పంజాబ్ తరహాలో మొత్తం ధాన్యాన్ని కొనాల్సిందే .ఇదే అంశంపై ఢిల్లీకి మంత్రులు, ఎంపీలు. ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదంటూ స్పష్టీకరణ ప్రశాంత్ కిశోర్
తనకు ఎనిమిదేండ్ల నుంచి పరిచయం. ఆయన మాతో కలిసి పని చేస్తే తప్పేంటీ.
- సీఎం కేసీఆర్
- టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశవ్యాప్తంగా ఇప్పుడు కశ్మీర్ ఫైల్స్ సినిమాపై చర్చ కొనసాగుతున్నదనీ, వాస్తవానికి ఇప్పుడు మనం చర్చించాల్సింది కిసాన్ ఫైల్స్ (రైతు సమస్యలు)పై అని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. అన్నదాతల సమస్యలను పక్కదారి పట్టించేందుకే 'కాశ్మీర్ ఫైల్స్...'ను విస్తృతంగా ప్రచారంలో పెట్టారని ఆయన విమర్శించారు. కాశ్మీర్ పండిట్లపై దాడులు జరిగినప్పుడు బీజేపీ అధికారంలో లేదా..? అని ప్రశ్నించారు. పంజాబ్లో సేకరిస్తున్న మాదిరిగానే తెలంగాణలో యాసంగిలో ఉత్పత్తి అయ్యే వరి ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో తీర్మానించామని వెల్లడించారు. ఇదే అంశంపై మంత్రులు, తమ పార్టీ ఎంపీలు ఢిల్లీకి బయల్దేరి వెళుతున్నారని తెలిపారు. తద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారని చెప్పారు. రైతు పోరు పేరిట ఈనెల 25 నుంచి గ్రామస్థాయి నుంచి ఆందోళనలు నిర్వహించాలని సీఎం సూచించారు. వాటిని జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పంట కొనుగోళ్లకు సంబంధించి 'ఒకే దేశం - ఒకే సేకరణ...' అనే విధంగా కేంద్రం విధానముండాలని అభిప్రాయపడ్డారు.
సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మెన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు, వివిధ కార్పొరేషన్ల చైర్మెన్లు హాజరయ్యారు. యాసంగిలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. భేటీలో తీసుకున్న నిర్ణయాలను ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. యాసంగిలో 35 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందని తెలిపారు. మూడు లక్షల ఎకరాల్లోని పంటను విత్తనాల కోసం రైతులు వాడుకుంటారు. మరో రెండు లక్షల ఎకరాలు సొంత అవసరాలకు వాడుకుంటారని చెప్పారు. ఇదే సమయంలో పంట మార్పిడి కింద దాదాపు 25 లక్షల ఎకరాల మేర వరి పంట తగ్గిందని వివరించారు. అతివృష్టితోపాటు ప్రకృతి వైపరీత్యాలు వస్తే దేశంలో ఆహార కొరత రాకూడదని భావించి తీసుకొచ్చిందే ఆహార భద్రత చట్టమని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. ఆ చట్టం నిర్వహణ బాధ్యతను రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వానికి అప్పగించిందని వివరించారు. ఈ క్రమంలో కేంద్రమే ధాన్యాన్ని సేకరించాలని తెలిపారు. ఆ బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకోకూడని చెప్పారు. ధాన్యం సేకరణలో గతంలోనూ కేంద్రం ఇబ్బందులను సృష్టించిందని వివరించారు. యాసంగిలో వచ్చే వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలనీ, కనీస మద్దతు ధర బియ్యానికి కాదు.. ధాన్యానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ ధర ప్రకారమే పంజాబ్లో ధాన్యాన్ని సేకరిస్తున్నారని గుర్తు చేశారు. అదే విధంగా తెలంగాణలోనూ ధాన్యాన్ని సేకరించాలని కోరారు. బాయిల్డ్ రైస్ మాత్రమే ఇవ్వాలని కేంద్రం చెబుతోందనీ, ధాన్యాన్ని ఇస్తే ముడి బియ్యం చేస్తారా? బాయిల్డ్ రైస్ చేస్తారా? అనే దానిపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఈ క్రమంలో ధాన్యం సేకరణ విషయంలో దాని వైఖరి సరిగ్గా ఉంటే స్వాగతిస్తామన్నారు. లేదంటే ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉండాలంటూ రైతులకు, టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేపడతామనీ, తెలంగాణ ఉద్యమ స్థాయిలో రైతుల కోసం పోరాడతామని కేంద్రాన్ని సీఎం హెచ్చరించారు. 'దేశంలో ఇప్పటివరకు అందరికీ రాజ్యాంగ పరమైన రక్షణ ఉంది. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు మాత్రం ఆ విధమైన రక్షణ లేదు. రాజ్యంగ పరంగా రైతుల హక్కులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. మా పార్టీ తరఫున మేం డిమాండ్ చేస్తున్నాం. రైతులను కాపాడాలన్నా.. వారి గౌరవం పెరగాలన్నా.. వారు స్వయం సమృద్ధిని సాధించాలన్నా.. వారికి రాజ్యాంగ పరంగా రక్షణ కల్పించాలి. తద్వారా కేంద్రం తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని నిరూపించుకోవాలి. ముందుకొచ్చి రైతులను చట్ట పరిధిలోకి తీసుకురండి. వారికి రక్షణ కల్పించండి. ఆ రకంగా రాజ్యాంగ సవరణ చేయండి. చిత్తశుద్ధి ఉంటే ఇదే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టండి. మా పార్టీ తప్పకుండా మద్దతు తెలుపుతుంది...' అని కేసీఆర్
మోడీ సర్కారుకు సూచించారు. 'ఉత్తర్ప్రదేశ్లో బీజేపీ బలం తగ్గుతోందని గతంలోనే చెప్పాను. యూపీలో గతంలో ఆ పార్టీకి 312 సీట్లు వస్తే.. ఈ ఎన్నికల్లో 255 స్థానాలకు పరిమితమైంది. సీట్లు తగ్గడం దేనికి సంకేతమో బీజేపీ ఆలోచించుకోవాలి. ఆ పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారిపోతుంది. బీజేపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు, పరిశ్రమలు తీసుకురాలేదు. దేశం బాగుండాలంటే ఆ పార్టీని గద్దె దించాల్సిందేనని ప్రజలు భావిస్తున్నారు. యూపీఏ పాలన సరిగా లేదని ప్రజలు మోడీకి అధికారం ఇచ్చారు. అయితే బీజేపీ పాలన మరింత అధ్వాన్నంగా ఉంది. ప్రభుత్వరంగ సంస్థలను మోడీ తన తాబేదార్లకు చౌకగా కట్టబెడుతున్నారు...' అని విమర్శించారు.
ఆరునూరైనా ముందస్తు ఎన్నికలకు పోయే ప్రసక్తే లేదని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గతంలో అవసరం మేరకు ముందస్తు ఎన్నికలకు వెళ్ళామన్నారు. ఈసారి తమ పార్టీ 95 నుంచి 105 స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మూడు సంస్థలు 30 స్థానాల్లో సర్వే చేసి నివేదిక ఇచ్చాయన్నారు. 30 స్థానాలకు గాను 29 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుస్తుందంటూ నివేదికలు వచ్చాయని వివరించారు. వాటి ఆధారంగా మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 4 స్థానాలనే కోల్పోతామని తెలుస్తున్నదని వివరించారు. మరో 25 రోజుల్లో నివేదికను బహిర్గతం చేస్తామని చెప్పారు. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయడానికి తాను నిర్ణయం తీసుకున్నానని కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. ఈ క్రమంలో తన ఆహ్వానం మేరకు ప్రశాంత్ కిశోర్ వచ్చి తమతో కలిసి పని చేస్తున్నారని తెలిపారు. గత ఎనిమిదేండ్లుగా ఆయన తనకు మంచి స్నేహితుడని చెప్పారు. డబ్బుల కోసమే ఆయన పని చేయబోరని వ్యాఖ్యానించారు. దేశం పట్ల పీకేకు ఉన్న నిబద్ధత ఏమిటో అందరికీ తెలిసిందేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి ఎవరికీ ఎలాంటి ఆందోళన ఉండాల్సిన అవసరం లేదని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే వాటి విడుదలకు సమయం పడుతుందని సీఎం వివరించారు.