Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలేజీల అఫిలియేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం
- ఆన్లైన్లో సమర్పణ గడువు ఏప్రిల్ 5
- ఆలస్య రుసుంతో మే 17 వరకు అవకాశం
- ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ జారీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రయివేటు జూనియర్ కాలేజీల అనుబంధ గుర్తింపు, తనిఖీ ఫీజును ప్రభుత్వం భారీగా పెంచింది. అనుబంధ గుర్తింపు ఫీజు మున్సిపల్ కార్పొరేషన్లలో గతేడాది రూ.12 వేలుంటే, దాన్ని రూ.16 వేలు, తనిఖీ ఫీజు రూ.46 వేల నుంచి రూ.65 వేలు చేసింది. వచ్చే విద్యాసంవత్సరం (2022-23)కు సంబంధించి కాలేజీల అనుబంధ గుర్తింపు పునరుద్ధరణ కోసం ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. కాలేజీలు అదనపు సెక్షన్ల కోసమూ దరఖాస్తు చేయాలని కోరారు. 2020-21, 2021-22 విద్యాసంవత్సరాల్లో టీపీజేఎంఏ విజ్ఞప్తి మేరకు విద్యాశాఖ మంత్రి ఆదేశాలను బట్టి కాలేజీల గుర్తింపు, తనిఖీ ఫీజును పెంచలేదని గుర్తు చేశారు. అందుకే వచ్చే విద్యాసంవత్సరానికి ఫీజును పొడిగించామని వివరించారు. తనిఖీ ఫీజు మున్సిపల్ కార్పొరేషన్లలో రూ.65 వేలు, మున్సిపాల్టీల్లో రూ.50 వేలు, గ్రామ పంచాయతీల్లో రూ.20 వేలు, ఐదు కాలేజీల కంటే ఎక్కువున్న యాజమాన్యాలు మున్సిపల్ కార్పొరేషన్లలో రూ.75 వేలు, మున్సిపాల్టీల్లో రూ.62,500, గ్రామపంచాయతీల్లో రూ.25 వేలు చెల్లించాలని కోరారు. అనుబంధ గుర్తింపు ఫీజు మున్సిపల్ కార్పొరేషన్లలో రూ.16 వేలు, మున్సిపాల్టీల్లో రూ.14 వేలు, గ్రామపంచాయతీల్లో రూ.ఐదు వేలు కట్టాలని వివరించారు. ఐదు కాలేజీల కంటే ఎక్కువుంటే గుర్తింపు ఫీజు మున్సిపల్ కార్పొరేషన్లలో రూ.20 వేలు, మున్సిపాల్టీల్లో రూ.15 వేలు, గ్రామపంచాయతీల్లో రూ.10 వేలు చెల్లించాలని తెలిపారు. ఒకేషనల్ కాలేజీలు తనిఖీ ఫీజు మున్సిపల్ కార్పొరేషన్లలో రూ.60 వేలు, మున్సిపాల్టీల్లో రూ.36 వేలు, గ్రామపంచాయతీల్లో రూ.16 వేలు కట్టాలని కోరారు. అనుబంధ గుర్తింపు ఫీజు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లో రూ.ఐదు వేలు చెల్లించాలని పేర్కొన్నారు. ఆన్లైన్లో దరఖాస్తులను బుధవారం నుంచి స్వీకరిస్తామని తెలిపారు. దరఖాస్తుల సమర్పణకు ఆలస్య రుసుం లేకుండా గడువు వచ్చేనెల ఐదో తేదీ వరకు ఉందని పేర్కొన్నారు. ఆలస్య రుసుం రూ.వెయ్యితో ఏప్రిల్ 12 వరకు, రూ.3 వేలతో 19 వరకు, రూ.5 వేలతో 24 వరకు, రూ.10 వేలతో మే మూడో తేదీ వరకు, రూ.15 వేలతో అదేనెల పది వరకు, రూ.20 వేలతో 17 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశముందని వివరించారు. కాలేజీ యాజమాన్యాలు ్రbఱవ.షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
కాలేజీలు మూసుకోవాలా? : గౌరి సతీష్, టీపీజేఎంఏ అధ్యక్షులు
ప్రయివేటు జూనియర్ కాలేజీల అనుబంధ గుర్తింపు, తనిఖీ ఫీజు పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ ప్రయివేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం (టీపీజేఎంఏ) రాష్ట్ర అధ్యక్షులు గౌరి సతీష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనుబంధ గుర్తింపు ఫీజు తగ్గించాలనీ, మిక్స్డ్ ఆక్యుపెన్సీ నిబంధనలను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. లేదంటే నిరుద్యోగ పట్టభద్రులు స్థాపించిన కాలేజీలను నడపడం భారంగా మారుతుందని పేర్కొన్నారు. కాలేజీలను నిర్వహించాలా? లేక మూసుకోవాలా?అన్న పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందని వివరించారు. రాష్ట్రం వచ్చాక ప్రభుత్వ విధానాలతో 1,480 కాలేజీలు మూతపడ్డాయని పేర్కొన్నారు. త్వరలోనే తమ సంఘం జనరల్ బాడీ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. గత రెండేండ్లుగా కరోనా నేపథ్యంలో విద్యార్థులు ఫీజులు చెల్లించలేక, ప్రభుత్వం సకాలంలో స్కాలర్షిప్లను విడుదల చేయకపోవడంతో కాలేజీలను నడపలేని పరిస్థితి యాజమాన్యాలకు వచ్చిందని పేర్కొన్నారు. తనిఖీ, గుర్తింపు ఫీజులను పెంచడం సమంజసం కాదని తెలిపారు. ఈ విద్యాసంవత్సరానికి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.