Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అంజాన్ పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుసరిస్తున్న మతోన్మాద ఎజెండాపై యుద్ధం చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అంజాన్ పిలుపునిచ్చారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు దక్షిణాదిలో తెలంగాణ కేంద్ర బిందువుగా మారిందని చెప్పారు. రాష్ట్రంలో మతోన్మాద రాజకీయాలు చేసే ఆ శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉందని అన్నారు. ఈ క్రమంలో మతతత్వ వ్యతిరేక శక్తులు మరింత జాగ్రత్తతో, ఐక్యతతో పనిచేయాలని సూచించారు. హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో రెండురోజులపాటు జరిగే సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డిజి సాయిలు అధ్యక్షతన మంగళవారం ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన ప్రముఖులు, పార్టీ నాయకులకు సంతాపాన్ని ప్రకటిస్తూ ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం అతుల్ కుమార్ అంజాన్ మాట్లాడుతూ నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ) పేరుతో ఆశ్రిత పెట్టుబడిదారులకు ప్రభుత్వ రంగ సంస్థలు, ఆస్తులను కేంద్ర ప్రభుత్వం తెగనమ్మేస్తోందని విమర్శించారు. దేశ సంపదను, కార్మిక హక్కులను కాపాడుకునేందుకు ఈనెల 28, 29 తేదీల్లో కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మె దేశభక్తియుతమైందని అన్నారు. రష్యా-ఉక్రెయిన్ వ్యవహారాన్ని చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత లేకపోవడాన్ని గమనించి కేంద్రప్రభుత్వం నదుల అనుసంధానం పేరుతో కృష్ణా, గోదావరి ప్రాజెక్టులను స్వాధీనం చేసుకున్నదన్నారు.