Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోస్టర్ ఆవిష్కరించిన సారంపల్లి, సాగర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వ్యవసాయంలో వస్తున్న మార్పుల ఫలితంగా మహిళల పాత్ర గణనీయంగా పెరిగిందని తెలంగాణ రైతు సంఘం పేర్కొంది. సాగు ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు మహిళా రైతులు రుణబారిన పడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో మహిళా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 25న మహబూబాబాద్‌లో 'వ్యవసాయరంగం-మహిళల పాత్ర' అనే అంశంపై రాష్ట్ర సదస్సు నిర్వహిస్టున్నట్టు వెల్లడించింది. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో (ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర)లో రాష్ట్ర సదస్సుకు సంబంధించిన పోస్టర్‌ను ఏఐకెేఎస్్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాదరావు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ప్రసాద్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మల్లారెడ్డి, సాగర్ విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్ర సదస్సుకు అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరు అవుతారని చెప్పారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగిన తర్వాత మహిళల పాత్ర గణనీయంగా పెరిగిందన్నారు. యంత్రీకరణతో మగవారు చేసే పనులన్నీ యంత్రాలు చేయడంతో ఇతర పనుల నిమిత్తం పురుషులు పట్టణాలకు పోతున్నారని చెప్పారు. గతంలో ఎకరాకు 52 మంది కూలీలు పని చేసేచోట నేడు 20 మంది మాత్రమే పని చేస్తున్నారని వివరించారు.
గతం కంటే మహిళా రైతులపై పని భారం పెరిగిందన్నారు. కుటుంబం, ఆర్థిక సమస్యలు, పొలంలోకి వెళ్లి పని చేయడం తదితర సమస్యలతో మహిళలు సతమతమవుతున్నారని చెప్పారు. ఇంత పని చేసినా మహిళలకు ఆర్థిక ఆధిపత్యం లేకపోవడం వల్ల భారం పెరుగు తున్నదని చెప్పారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో సన్న, చిన్నకారు రైతు కుటుంబాల్లోని మహిళలకు రుణభారం పెరిగి ఆత్మహత్యలకు పాల్పడు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆ కుటుంబాల పరిస్థితి చిన్నాభిన్న మవుతున్నదని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మహిళలు ఆత్మహత్యలు చేసుకోవడం భారత దేశంలో ఎక్కువగా జరుగుతున్నదని చెప్పారు. ఇలాంటి సమస్యలపై రాష్ట్ర సదస్సులో చర్చించి నివారణ చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఒత్తిడి పెంచుతామన్నారు. విద్యా, వైద్య రంగాలతోపాటు వ్యవసాయరంగంలో మహిళల పాత్రపై కూడా చర్చలు కొనసాగుతాయని చెప్పారు.