Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభినందన సభలో అలుగుబెల్లి నర్సిరెడ్డి, జూలకంటి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకునేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫీల్డ్ అసిస్టెంట్ల అభినందన సభను నిర్వహిం చారు. దీనికి తెలంగాణ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెం ట్ల యూనియన్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్షులు భూపాల్ అధ్యక్షత వహించారు. నర్సిరెడ్డి మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. వారి సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్‌లో అన్ని విధాలుగా సహకరిస్తామని హామీనిచ్చారు. జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. రెండేండ్లు పోరాడి ఉద్యోగాలు తిరిగి సాధిం చుకున్న 7,500 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు అభినందనలు తెలిపారు. వారిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రెండేండ్ల కాలంలో చనిపోయిన 70 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కేంద్రంపై పోరాటం చేయడం బాగానే ఉందనీ, అదే సందర్భంలో రాష్ట్రంలో సమస్యల పరిష్కారం కోసం పోరాడు తున్న వారిని కూడా గౌరవించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు మాట్లాడుతూ గతంలో ఇచ్చిన సర్క్యూలర్ నెం.4779ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మె కాలానికి జీతాలు చెల్లించాలని కోరారు. ఫీల్డ్ అసిస్టెంట్లందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం. నారాయణ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ ఒకే మాట, ఒకే బాటగా ఉండాలని పిలుపు నిచ్చారు. ఉద్యోగాలు సాధించుకునే వరకు పోరాడా లనీ, కొంత మంది మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. భూపాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న మార్చి 28, 29 సమ్మెలో ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొనాలని పిలుపునిచ్చారు. త్వరలో గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిని, కమిషనర్‌ను కలిసి ధన్యవాదాలు తెలుపుతా మన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం.నారాయణగౌడ్, సహాయ కార్యదర్శి పరిగి వెంకటయ్య, రాష్ట్ర నాయకులు రమేష్, భీంషప్ప, జంగయ్య, బాలరాజు, పార్థసారధి, అంజయ్య, నాగరాజు, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.