Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంటులోనూ అబద్ధాలు చెప్తారా?
- నేడు గిరిజనగూడేల్లో బీజేపీ శవయాత్రలు: మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
గిరిజన రిజర్వేషన్లపై కేంద్రమంత్రి విశ్వేశ్వర్ తుడూ పార్లమెంటులో అబద్ధాలు చెప్పారని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గిరిజన రిజెర్వేషన్లపై బిల్లే రాలేదని చెప్పి కేంద్రమంత్రి గిరిజనులను, రాష్ట్ర ప్రభుత్వాన్నీ అవమానించారని చెప్పారు. మంగళవారంనాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫేక్ న్యూస్‌తో కూడిన బీజేపీ వాట్సప్ యూనివర్సిటీ ఇప్పుడు పార్లమెంటుకూ చేరిందని ఎద్దేవా చేశారు. కేంద్రప్రభుత్వం వాస్తవాలను దాచి రాజ్యాంగాన్ని అవమానించిందన్నారు. అది కేంద్రప్రభుత్వమో, ప్రయివేటు కంపెనీనో అర్థం కావట్లేదన్నారు. పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రశ్న అడిగారనీ, ఆయన ప్రశ్న అడగడంలోనే లోపం ఉందని మంత్రి హరీశ్‌రావు ఆక్షేపించారు. ఉత్తమకుమార్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నపుడు ఈ బిల్లును శాసన సభ ఆమోదించిందనీ, కిషన్‌రెడ్డి అపుడు ఎమ్మెల్యేగా ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారని చెప్పారు. గిరిజన రిజర్వేషన్ల బిల్లుపై కేంద్రంతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలను మీడియా ముందు పెట్టామనీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు దీనిపై ప్రధాని నరేంద్రమోడీకి లేఖలు రాసారనీ వివరించారు. పార్లమెంటును పక్కదారి పట్టించిన కేంద్ర మంత్రి తుడూ ను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం గిరిజన, గోండు గూడేలు, కాలేజీలు, యూనివర్సిటీల్లో బీజేపీ శవయాత్రలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. గిరిజనులను అవమాన పరిచిన కేంద్రప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశ పెడతామన్నారు. సభను అడ్డుకుంటామనీ, తాము పంపిన బిల్లును ఈ సమావేశాల్లోనే కేంద్రం ఆమోదించాలని పట్టు బడుతామనీ చెప్పారు. ఐదేండ్లుగా గిరిజన రిజర్వేషన్ల బిల్లును కేంద్రప్రభుత్వ తొక్కిపెట్టి, ఇప్పుడు అసలు బిల్లేరాలేదని అబద్ధాలు చెప్పడాన్ని క్షమించబోమన్నారు. ఈ విషయంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.