Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14,15 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం
- 18,19,20 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగం.. జులై 13న ఈసెట్
- షెడ్యూల్ ప్రకటించిన మంత్రి సబిత వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎంసెట్, ఈసెట్ షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం విడుదల చేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులోల ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ రాతపరీక్షలు జులై 14 నుంచి ప్రారంభించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం విద్యార్థులకు జులై 14,15 తేదీల్లో, ఇంజినీరింగ్ విభాగం విద్యార్థులకు 18,19,20 తేదీల్లో ఎంసెట్ నిర్వహిస్తామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి షెడ్యూల్‌ను ప్రకటించారు. మేలో ఇంటర్, పదో తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో జులైలో ప్రవేశ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఎంసెట్‌ను 23 ప్రాంతీయ కేంద్రాల పరిధిలో 105 పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తామని వెల్లడించారు. దరఖాస్తు చేసుకోవడానికి గడువు, రిజిస్ట్రేషన్ ఫీజు తదితర వివరాలతో కూడిన నోటిఫికేషన్లు సెట్ కన్వీనర్ ప్రకటిస్తారని తెలిపారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన అభ్యర్థులు ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్‌ను జులై 13న నిర్వహిస్తామని వివరించారు.