Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15 కోట్ల భారతీయుల రోజువారీ ఒక్కొక్కరి ఆదాయం రూ.140
- ఒక్కో కార్పొరేట్ సంస్థ యజమాని ఆదాయం రోజుకు రూ.1000 కోట్లు
- భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు రావెళ్ల సత్యం
- పార్టీలు మారి ప్రజాతీర్పును అపహాస్యం చేసిన ఎమ్మెల్యేలు
- 28, 29న భారత్ బంద్‌కు టీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలి..: బృందాకరత్
- ధరణి సమస్యలపై సర్వేలు.. ఆపై ప్రజా ఉద్యమాలు: తమ్మినేని
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
బీజేపీ హయాంలో దేశంలో మరింతగా అసమానతలు పెరిగాయని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్ అన్నారు. ప్రపంచంలో అసమానతలు అత్యధికంగా మన దేశంలోనే ఉన్నాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయన్నారు. కరోనా సమయంలో ఒక్కో నిరుపేద ఆదాయం రోజుకు రూ.140 చొప్పున ఉంటే.. ఒక్కో కార్పొరేట్ సంస్థ యజమాని ఆదాయం రోజుకు రూ.వెయ్యి కోట్లని తెలిపారు. దేశంలో 25% జనాభా విద్య, ఆరోగ్యం, పౌరహక్కులు లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల పార్టీ నూతన కార్యాలయం (రావెళ్ల సత్యం భవనం) ప్రారంభం సందర్భంగా మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 28, 29న నిర్వహించనున్న భారత్‌బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మెకు టీఆర్ఎస్ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. అకస్మాత్తుగా సీఎం కేసీఆర్‌కు జ్ఞానోదయమై ఢిల్లీకి మంత్రుల బృందాన్ని పంపడం ఆహ్వానించదగిన పరిణామం అయినా.. కేరళ సీఎం విజయన్ తరహాలో అన్ని పక్షాల నాయకులను పంపించి ఉండాల్సిందన్నారు. ప్రజలు, రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్న బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పోరాడాలన్నారు.
కేరళలో జరగనున్న సీపీఐ(ఎం) అఖిల భారత మహాసభలో కార్మిక, కర్షకుల కోసం ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేయడంపై చర్చిస్తామన్నారు. ఓట్లు, సీట్ల కోసం వెంపర్లాడే పార్టీలకు కాకుండా.. ప్రజా సమస్యలపై నిఖార్సైన పోరాటాలు చేసే కమ్యూనిస్టులకు పట్టం కట్టాలన్నారు. పాలేరు నియోజకవర్గ ప్రజలు బీజేపీ, టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌కు ఓటు వేస్తే చివరకు ఆ ఎమ్మెల్యే పార్టీ మారి ప్రజా తీర్పును అపహాస్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో 15 కోట్ల భారతీయులు రోజుకు ఒక్కొక్కరు రూ.140 సంపాదించలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. తెలంగాణ సాయుధ పోరాటమే కాదు భారత కమ్యూనిస్టు ఉద్యమంలో పోరాడిన వీరవనిత మల్లు స్వరాజ్యం అన్నారు. త్యాగం కమ్యూనిస్టుల వారసత్వం అంటూ రావెళ్ల సత్యం కూతురు వెంకటలక్ష్మిని సభకు పరిచయం చేశారు. ఒంటిచేత్తో రావెళ్ల భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన తీరు స్ఫూర్తిదాయకం అన్నారు. పేదలు, శ్రామికులు, భూములు లేని నిరుపేదల పక్షాన నిబద్దత రావెళ్ల పోరాటం చేశారన్నారు. అణగారినవర్గాలు, సాంఘిక న్యాయం కోసం ప్రాణత్యాగం చేశారని చెప్పారు. బీజేపీ అనుసరిస్తున్న ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక ఆధిపత్య ధోరణకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు నిర్వహిస్తున్న పోరాటాలకు కలిసి రావాలని కోరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సీపీఐ(ఎం) పోరాట ఫలితమే సీతారామ.. : తమ్మినేని
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ఎత్తిపోతల పథకం కమ్యూనిస్టుల పోరాట ఫలితమేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ధరణి భూ సమస్యలపై మూడునెలల పాటు సర్వేలు నిర్వహించి.. ఆపై ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామన్నారు. రాజ్యాంగ మూలసూత్రాలకు మోడీ తిలోదకాలు ఇస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే ప్రభుత్వ రంగాల్లో 1.91 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కేవలం 90వేల ఖాళీలను భర్తీ చేస్తామని సీఎం ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దళితులకు ఇచ్చిన హామీల్లో కేసీఆర్ ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా నిర్వహించే పోరాటాల్లో కేసీఆర్ అందర్నీ కలుపుకుపోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేశ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, టి.జ్యోతి, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడారు. రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారతి, యర్రా శ్రీకాంత్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరరావు, భూక్యా వీరభద్రం, వై.విక్రమ్, బుగ్గవీటి సరళ, పొన్నం వెంకటేశ్వర్లు, బొంతు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నేలకొండపల్లి మండల కార్యదర్శి కేవీ రాంరెడ్డి ఆహుతులను వేదిక మీదకు ఆహ్వానించారు. మండల కార్యదర్శివర్గ సభ్యులు పగిడికత్తుల నాగేశ్వరరావు వందన సమర్పణ చేశారు.