Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యూబోయిగూడలో జరిగిన ఘటనపై లోతైన విచారణ
- మృతదేహాలను విమానాల్లో స్వస్థలాలకు తరలింపు : హౌం మంత్రి మహమూద్ అలీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో జన సమ్మర్థ ప్రాంతాల్లో ఉన్న స్క్రాప్ గోడౌన్లలో భద్రతపై సమగ్ర సర్వే జరిపిస్తామని రాష్ట్ర హౌం మంత్రి మహమూద్ అలీ ప్రకటించారు. బుధవారం తెల్లవారుజామున న్యూబోయిగూడలోని స్క్రాప్ గోడౌన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది కార్మికులు సజీవ దహనమైన ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన తన కార్యాలయంలో బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. న్యూ బోయిగూడలోని స్క్రాప్ గోడౌన్లో జరిగిన ఘటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా స్క్రాప్ గోడౌన్లతో పాటు ఇతర గోడౌన్లలో అగ్నిప్రమాదాలకు సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలపై సమగ్ర సర్వేను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ముఖ్యంగా, ఈ గోడౌన్లలో అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించిన ఎన్ఓసీతో పాటు ఇతర అనుమతులను ఆయా గోడౌన్ల యాజమాన్యాలు తీసుకున్నాయా? లేదా? అన్నది కూడా సర్వే జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యంగా, జనసమ్మర్థ ప్రాంతాల్లోని స్క్రాప్ గోడౌన్లలోనే కార్మికుల నివాసాలు ఏర్పాటు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టాడు. ఇకపై గోడౌన్లు, గోడౌన్ల ఆవరణలో అందులో పని చేసేవారి నివాసాలుండకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హౌం మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు, జనసమ్మర్థ ప్రాంతాలు, జన నివాసాలున్న ప్రాంతాల్లో స్క్రాప్ గోడౌన్లు మొదలుకొని ఇతర గోడౌన్లు ఉండకుండా చూడటం, వాటిని జనావాసాలకు దూరంగా ఉంచేలా చర్యలు కూడా చేపట్టనున్నామని ఆయన చెప్పారు.