Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిస్కంలకు టీఎస్ఈఆర్సీ ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వ్యవసాయ విద్యుత్ పంపిణీ ట్రాన్స్ఫార్మర్ల వద్ద కరెంటు మీటర్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) డిస్కంలను ఆదేశించింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త టారిఫ్ ప్రకటన విడుదల సందర్భంగా బుధవారం మండలి చైర్మెన్ శ్రీరంగారావు విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టాలన్నింటినీ వ్యవసాయ ఉచిత విద్యుత్‌లో కలిపేస్తున్నారనే విమర్శపై ఆయన స్పందించారు. దీనిపై డిస్కంలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. 2(ఏ) కమ్యూనికేషన్ టెక్నాలజీతో రెండేండ్లలో అన్ని వ్యవసాయ విద్యుత్ పంపిణీ ట్రాన్స్ఫార్మర్ల వద్ద మీటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు. రైతుల వ్యవసాయ కనెక్షన్ల వద్ద మీటర్లు పెట్టట్లేదనీ, ట్రాన్స్ఫార్మర్ల వద్దే మీటర్లు ఉంటాయని వివరణ ఇచ్చారు. వ్యవసాయ విద్యుత్ వినియోగం ఖచ్చితత్వం తెలుసుకొనేందుకే ఈ ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. అలాగే ఏటీ అండ్ టీ నష్టాలను డిస్కంలు 15 శాతానికంటే దిగువకు తగ్గించుకోవాలనీ, అలా చేయకుంటే వచ్చే నష్టాలను తర్వాతి సంవత్సరంలో చేసుకొనే క్లెయిమ్స్‌లో తిరస్కరిస్తామని తెలిపారు. హెచ్‌టీ కేటగిరిలో గ్రీన్‌టాక్స్ టారిఫ్‌ను రూ.2 గా డిస్కంలు ప్రతిపాదించాయనీ, వాటిని 66 పైసలుగా నిర్ణయించామన్నారు. డిస్కంలు ప్రతి మూడు నెలలకూ తమ ఆదాయ వ్యయాల నివేదికల్ని టీఎస్ఈఆర్సీకి సమర్పించాలనీ, ఏటా నవంబర్ 30వ తేదీ లోపు ప్రతిపాదిత టారిఫ్‌ను కూడా ఇవ్వాలనీ, లేకుంటే డిస్కంలకు జరిమానాలు విధిస్తామన్నారు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు నిర్ణీత కాలవ్యవధితో కూడిన ప్రతిపాదనలను ఇవ్వాలని డిస్కంలను కోరినట్టు చెప్పారు. ప్రభుత్వ బకాయిలపై డిస్కంలు కమిషన్ ఎదుట పిటీషన్ వేస్తే, దాన్ని విచారిస్తామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఐదు కరెంటు మీటర్ల వరకు ప్యానెల్ బోర్డులు అక్కర్లేదనీ, అంతకు మించి ఉంటేనే ప్యానల్ బోర్డులు అవసరమని స్పష్టంచేశారు. వీటి ఏర్పాటుపై తమకు ఏవైనా లిఖితపూర్వక ఫిర్యాదులు అందితే విచారిస్తామన్నారు. లేట్ పేమెంట్ చార్జీలు, పెనాల్టీలు, డిస్కనెక్షన్ చార్జీల వంటివి కొత్త టారిఫ్‌లో పెంచలేదని తెలిపారు.ఎలక్ట్రికల్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల టారిఫ్‌ను పెంచాలని డిస్కం లు ప్రతిపాదించాయనీ, వాటిని తిరస్కరించమన్నారు. అయితే డిమాండ్ చార్జీలు (రూ.100), కష్టమర్ చార్జీలు (రూ.120) విధించినట్టు తెలిపారు. అలాగే హెచ్‌టీ కేటగిరి (భారీ పరిశ్రమలు) 11 కేవీలో ప్రస్తుతం ఉన్న రూ.1,685 కస్టమర్ చార్జీలను రూ.2వేలకు, 33 కేవీలోని రూ.3,500కు, 132 కేవీ అంతకంటే ఎక్కువ సామర్ధ్యం వినియోగించే పరిశ్రమలకు ప్రస్తుతం ఉన్న రూ.3,370 కస్టమర్ చార్జీలను రూ.5వేలకు పెంచారు.