Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'రమ్మీ'పై హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరీంనగర్‌లోని పుష్పాంజలి రిసార్ట్స్ వ్యవహారంలో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారనే కేసులో ఒక ఐపీఎస్ అధికారి సహా ముగ్గురు పోలీసులకు సింగిల్ జడ్జి విధించిన జైలు శిక్ష, జరిమానాలను హైకోర్టు రద్దు చేసింది. ఆరు నెలల జైలు, రూ.రెండు వేల జరిమానాను విధిస్తూ సింగిల్ జడ్జి మూడేండ్ల కిత్రం వెలువరించిన తీర్పుపై ఐపీఎస్ అధికారి, నాటి కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి, ఏసీపీ తిరుపతి, సీఐ శశిధర్‌రెడ్డి హైకోర్టులో అప్పీల్ చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. రిసార్ట్స్‌లో చట్ట వ్యతిరేకంగా రమ్మీ అడుతుంటే, దాడులు చేసి తనిఖీలు నిర్వహించే అధికారం పోలీసులు ఉంటుందని స్పష్టం చేసింది.
సూర్యాపేట జిల్లా జడ్జికి ఉత్తర్వులు
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు రామోజీతాండాకు చెందిన గిరిజన యువకుడు వీరశేఖర్‌ను తీవ్ర చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై హైకోర్టు స్పందించింది. విచారణ జరిపి 60 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని సూర్యాపేట జిల్లా జడ్జిని ఆదేశించింది. వీరశేఖర్ జిల్లా వైద్యాధికారిని సంప్రదించాలని సూచించింది. అతనికి అవసరమైన వైద్య చికిత్సలు అందజేయాలంటూ డీఎమ్ అండ్ హెచ్వోను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావలితో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశాలిచ్చింది. దొంగతనం ఆరోపణలతో గతేడాది నవంబర్ 10న వీరశేఖర్‌ను ఎస్ఐ ఎం.లింగయ్య తీవ్ర చిత్రహింసలకు గురిచేశారని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతోపాటు బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ న్యాయవాది రాఘవేంద్ర ప్రసాద్ దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు బుధవారం విచారించింది.