Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసైన్డ్ భూములనూ వదలట్లేదు : దాసోజు శ్రవణ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టీఆర్ఎస్ ప్రభుత్వం తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్లతో రియల్ఎస్టేట్ దందా చేయిస్తున్నదని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఆనాటి ప్రభుత్వాలు దళితులు, పేదలకిచ్చిన అసైన్డ్భూములను సైతం వదల్లేదని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేత మెట్టు సాయి, ముంజగాళ్ల విజయకుమార్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు.అసైన్డ్ భూములకు పేదలను శాశ్వత హక్కుదారులను చేస్తామంటూ ఉద్యమ కాలంలో కేసీఆర్ హామీ ఇచ్చారనీ,ఆయన అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు అయినా అది అమలు కాలేదన్నారు. వారు భూములను మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలను తుంగలోతొక్కి దళితుల అసైన్డ్భూములను లాగేసుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ అవసరాల కోసం భూములు తీసుకోవచ్చుగానీ వాటిలో దందా చేయడం దారుణమని విమర్శించారు.25 లక్షల ఎకరాల భూములను వెంచర్ల కోసం అక్రమంగా తీసుకున్నారని విమర్శించారు. మంత్రి పువ్వాడ అజరుకుమార్ అసైన్డ్ భూములను క్రమబద్ధికరించుకున్నారని పేర్కొన్నారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ నిర్మాణం కోసం 111 ఎకరాలు సేకరించారనీ, ఆ భూములు కోల్పోయిన వారికి ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని చెప్పారు.