Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ
- ధాన్యం కొనకుండా రైతులకు అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచన
- ప్రజా సమస్యలపై ఏప్రిల్ 6న ఇందిరాపార్క్ వద్ద ధర్నా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో సెప్టెంబర్ నాలుగు నుంచి ఏడో తేదీ వరకు సీపీఐ రాష్ట్ర మూడో మహాసభ నిర్వహించాలని ఆ పార్టీ రాష్ట్ర సమితి సమావేశం నిర్ణయించింది. ఏప్రిల్, మేలో శాఖల మహాసభలు, జూన్ నుంచి జులై 15వ తేదీ వరకు మండల, పట్టణ మహాసభలు, జులై 15 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు జిల్లా మహాసభలు నిర్వహించనున్నారు. రాష్ట్ర మహాసభల అనంతరం అక్టోబర్ 14 నుంచి 18వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో సీపీఐ 24వ జాతీయ మహాసభలు జరగనున్నాయి. హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో రెండురోజులపాటు జరిగిన సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా మఖ్దూంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం ప్రత్యారోపణలు చేసుకుంటూ రైతులకు అన్యాయం చేయొద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ప్రతి గింజా కొనాల్సిందేననీ, లేదంటూ పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. 'బయ్యారం ఉక్కు - తెలంగాణ హక్కు'అని, విభజన చట్టంలో హామీ మేరకు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వేకోచ్ కర్మాగారం, గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో వచ్చేనెల ఆరో తేదీన ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయనున్నట్లు వివరించారు. ఈనెల 28,29 తేదీల్లో కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పోడు భూములకు దరఖాస్తులు తీసుకున్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు వాటి ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. తక్షణమే పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ధరణి పోర్టల్ లొసుగులపై నిరంతర ప్రాతినిధ్యంతోపాటు జిల్లా స్థాయిలో కార్యాచరణను చేపట్టనున్నట్టు చెప్పారు. 57 ఏండ్లు నిండిన వారికి ఆసరా పింఛన్, కొత్త రేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, స్వంత ఇంటి నిర్మాణానికి రూ.మూడు లక్షలు కాకుండా రూ.ఆరు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగ ఖాళీల భర్తీ, కాంట్రాక్టు, ఔట్ ఉద్యోగాల క్రమబద్ధీకరణకు ఉద్యమాలు చేపడతామని అన్నారు. మిర్చి రైతులకు ఎకరానికి రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 111 జీవో ఎత్తివేతపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలనీ, పర్యావరణవేత్తలు, నిపుణులను ప్రభుత్వం సంప్రదించాలని కోరారు. 30 పోలీస్ యాక్ట్‌ను ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి ఉపయోగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు అప్రజాస్వామిక వైఖరిని వీడాలనీ, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని కోరారు. రాష్ట్రాల హక్కులు హరించేలా సాగునీటి ప్రాజెక్టులను ఆధీనంలో తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
బీజేపీకి ఎంఐఎం బీ టీమ్ : అజీజ్‌పాషా
ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయడం ద్వారా బీజేపీకి ఆ పార్టీ బీ టీమ్ అని నిరూపితమైందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్‌పాషా అన్నారు. ఆ పార్టీకి కొంత పునాది ఉన్న తెలంగాణలో ఏడు స్థానాల్లోనే పోటీ చేసి, బలం లేని ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో వంద స్థానాల్లో ఎంఐఎం పోటీ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారని చెపాపరు. అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగాలు చూశాక లౌకికతత్వం ఉన్న హిందువులు సైతం బీజేపీకి ఓటు వేశారని వివరించారు. బీఎస్పీ, ఎంఐఎం వల్లే బీజేపీ తిరిగి గెలిచిందన్నారు.
విద్యుత్ చార్జీల పెంపునకు సీపీఐ ఖండన
వినియోగదారులపై రూ.14 వేల కోట్ల భారం మోపుతూ వచ్చేనెల ఒకటో తేదీ నుంచి విద్యుత్ చార్జీలను పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి అనుమతించడాన్ని సీపీఐ తీవ్రంగా ఖండించింది. ఒకవైపు కేంద్రం నిత్యం వంటగ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతోందనీ, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్, ఆర్టీసీ చార్జీలు పెంచడం అన్యాయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. దీంతో ప్రతి నెలా సామాన్య, మధ్యతరగతి కుటుంబంపై కనీసం రూ.వెయ్యి అదనపు భారం పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే విద్యుత్ చార్జీలు పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.