Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధరల పెరుగుదలతో పేదలపై గుదిబండ : ప్రజాసంఘాల నేతలు
- సార్వత్రిక సమ్మె పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ- అంబర్‌పేట
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నీరుగారుస్తోందని, కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ప్రజాసంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. 28-29 తేదీల్లో చేపట్టనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్‌ను బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటుపరం చేయడంలో వేగం పెంచిందన్నారు. అనేక సంవత్సరాలు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నీరుగార్చి 4 కార్మిక కోడ్లుగా మార్చిందని చెప్పారు.
నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి కనీస మద్దతు ధరల చట్టం చేస్తానని హామీ ఇచ్చిందని, కానీ 3 నెలలు పూర్తయినా ఇప్పటి వరకు కమిటీ కూడా వేయకపోవడం రైతులను మోసం చేయడమేనని చెప్పారు. రైతుల ఆత్మహత్యల పరంపరను ఆపడానికి రైతుల అప్పులను మాఫీ చేయాలన్నారు. కేరళ తరహా రుణ విమోచన చట్టం చేయాలని, రైతులపై దేశవ్యాప్తంగా బనాయించిన అక్రమ కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కార్పొరేట్ల అనుకూల బడ్జెట్ అని, సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదని అన్నారు. విద్య, వైద్య రంగాలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి కేంద్ర సర్కార్ ప్రయత్నిస్తోందన్నారు. మార్చి 28, 29 తేదీల్లో జిల్లా, మండల కేంద్రాలు, గ్రామాల్లో ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పోస్టర్ ఆవిష్కరణలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు, మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్ పాల్గొన్నారు.