Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వలసకూలీలకు కార్మికశాఖ , ప్రభుత్వం భద్రత కల్పించాలి:
- సీపీఐ(ఎం) నగర కమిటీ డిమాండ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
బోయిగూడ గోడౌన్ ప్రమాద ఘటనకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, వలసకార్మికుల భద్రతకు కార్మికశాఖ, ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ప్రమాద ఘటనా స్థలాన్ని బుధవారం సీపీఐ(ఎం) బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధనలను తుంగలో తొక్కి, అనుమతులు లేకుండా నిర్వహిస్తూ వలస కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న గోడౌన్, వివిధ కాంట్రాక్టు సంస్థల యజమానులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. మృతిచెందిన కార్మికుల కుటుంబాలను పూర్తిస్థాయిలో ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా గోడౌన్ ఎలా కొనసాగుతోంది? జీహెచ్ఎంసీ అధికారులకు ఈ విషయం తెలియదా? అని ప్రశ్నించారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నిజానిజాలు తేల్చాలని, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అనేక సంస్థలు వలస కార్మికులను పనిలో పెట్టుకుని తగిన జీతాలు ఇవ్వకుండా కట్టుబానిసలుగా వాడుకుంటున్నాయని చెప్పారు. 11 మంది వలస కార్మికులు మంటల్లో కాలిపోయినా కార్మికశాఖ మంత్రి, అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. నగరంలో వలస కార్మికుల పని ప్రదేశాలు, నివాసప్రాంతాలపై సమగ్ర సర్వే జరిపి తక్షణమే వారి రక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.