Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంతాప సభలో ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.జ్యోతి
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ఆశయాలను సాదిద్దామని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.జ్యోతి అన్నారు. ఐద్వా గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నగర కార్యదర్శి కె.నాగలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన సంతాప సభలో జ్యోతి మాట్లాడారు. తెలంగాణ గడ్డపై పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడిన ధీరవనిత మల్లు స్వరాజ్యమని, దున్నేవాడిదే భూమి అని భూస్వాములపై పోరాడుతూనే, నిజాం నిరంకుశ పాలనపై తిరుగుబాటు చేశారని కొనియాడారు. ఆమె పాటలతో ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని నింపేవారని, 3000 గ్రామాలను నిజాం సైన్యాల నుంచి విముక్తి చేశారని చెప్పారు. ఆమె మహిళలకు సమాన హక్కుల కోసం కూడా అనేక ఉద్యమాలు చేశారని, మహిళలను చైతన్య పరిచి మహిళా సంఘాన్ని స్థాపించేందుకు కృషి చేశారని చెప్పారు. మహిళలకు చదువుకునే హక్కు, ఆస్తి హక్కుల కోసం కృషి చేయడమేకాక అనేక సామాజిక సమస్యలపై అలుపెరుగని పోరాటం చెప్పారు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆమెకు నిజమైన నివాళి అని చెప్పారు. నగర కార్యదర్శి కె.నాగలక్ష్మి మాట్లాడుతూ.. మల్లు స్వరాజ్యం గుర్రపు స్వారీ, ఈత, తుపాకి గురిపెట్టడం లాంటి అనేక విద్యలు నేర్చుకుని నిజాం నవాబుకు సింహ స్వప్నంగా మారారని గుర్తుచేశారు. మహిళలు ఏదైనా సాధించగలని ఆ రోజుల్లోనే నిరూపించారని, ఎమ్మెల్యేగా ఉంటూ అనేక మహిళా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని చెప్పారు. ఆమె అడుగు జాడల్లో నడిచి మహిళా సమస్యల పరిష్కారానికి అందరం కలిసికట్టుగా పోరాడాలని చెప్పారు. ఐద్వా నగర అధ్యక్షులు ఎ.పద్మ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నగర నాయకులు షాబాన, వరలక్ష్మి, విమల, ప్రవళిక, శారద, వెంకటమ్మ, అలేఖ్య, అశోకరాణి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.