Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-జనగామ
రైతు సమస్యల పరిష్కారం కోసం టీిఆర్‌ఎస్ ప్రభుత్వం ఒంటరిగా పోవడం కన్నా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. బుధవారం జనగామ జిల్లా కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అబ్బాస్‌తో కలిసి తమ్మినేని పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక వైఖరిని ప్రతిఘటిస్తూ టీఆర్ఎస్ పోరాటం మంచిదేనన్నారు. కానీ ఒంటరిగా కాకుండా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ధాన్యం కొనుగోలుతో పాటు, ఇతర సమస్యలపై ధర్నా నిర్వహించేందుకు ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.
ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉత్తుత్తి మాటలుగానే ఉన్నాయని, ఇప్పటికైనా వాటిని నెరవేర్చాలని తెలిపారు. అర్హులైన గిరిజనులందరికీ పట్టాలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ చార్జీలు పెంచి సామాన్యులపై పెనుభారం మోపిందన్నారు. ఇల్లు లేని వారికి ఇంటి జాగతో పాటు రూ.5లక్షలు ఆర్థిక సాయం చేయాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆర్భాటంగా ఖాళీ పోస్టులను ప్రకటించిందని, కానీ ఇప్పటివరకు ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీలను దాచిపెట్టిందని, మూడు లక్షల పైగా ఖాళీలు ఉన్నాయని తెలిపారు. పీఆర్సీ కమిటీ అధికారికంగా 1,91,126 పోస్టులు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తే, సీఎం మాత్రం 91,143 మాత్రమే ఖాళీలున్నట్టు ప్రకటించడం ఆందోళక రమన్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, లేకుంటే ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని హెచ్చరించారు.
సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఇర్రి అహల్య, రాపర్తి రాజు, రాపర్తి సోమన్న, గొల్లపల్లి బాపురెడ్డి, సాంబరాజు యాదగిరి, శేఖర్, గోపి, ఉపేందర్, కుమార్, నరేందర్, వెంకటేష్, సోమన్న, సభానా, తదితరులు పాల్గొన్నారు.