Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ జిల్లాలో రైతుల ఆందోళన, ముందస్తు అరెస్ట్
- అసిస్టెంట్ కలెక్టర్‌ను అడ్డుకున్న అన్నదాతలు
- రైతుల పక్షాన నిలిచిన టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం
- పోలీసు బందోబస్తులో ప్రజాభిప్రాయ సేకరణ
నవతెలంగాణ-శాయంపేట
నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి తమకు అన్నం పెట్టే పంట పొలాలు ఇచ్చే ప్రసక్తే లేదని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బలవంతపు భూసేకరణ ఆపాలని ఎనిమిది గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన వరంగల్ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలోకెళ్తే.. గట్లకానిపర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం జాతీయ రహదారి నిర్మాణానికి పర్యావరణంపై ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి ప్రారంభానికి ముందే కుసుంభ రాంచందర్‌రావు, రాజగోపాల్ ఇద్దరు రైతులను పోలీసులు అరెస్టు చేశారు. దాంతో మిగిలిన రైతులు పాఠశాల ప్రాంగణం ఎదుట ఆందోళన చేపట్టారు. రైతుల పక్షాన ప్రశ్నించే గొంతుకలను నొక్కి కార్పొరేట్ శక్తులకు పోలీస్, రెవెన్యూ అధికారులు దాసోహమై రైతులను అరెస్టు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన రైతులను విడుదల చేయాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని, పోలీస్, రెవెన్యూ సిబ్బంది తీరు మార్చుకోవాలని నినదించారు. సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణిని రైతులు అడ్డుకున్నారు. చివరికి పోలీసు బందోబస్తు నడుమ ఆమెను సమావేశానికి తీసుకెళ్లారు. రైతులు లేకుండానే అధికారులు సమావేశం నిర్వహిస్తుండగా తెలంగాణ జనసమితి (టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం అక్కడికి చేరుకున్నారు. రైతులతో మాట్లాడి సమావేశానికి తీసుకెళ్లారు. జాతీయ రహదారి పేరుతో సాగు భూములను లాక్కొని రైతులకు అన్యాయం చేయవద్దని అధికారులకు సూచించారు.
ఏలైన్మెంట్లో అధికారులకు రాజకీయ పరిస్థితులు దోహద పడుతున్నాయని, బడా నాయకులు ఉన్నచోట దారి పక్కకు జరిపామని నేషనల్ హైవే అధికారులే చెబుతున్నారనీ, కానీ సాధారణ ప్రజలైన రైతుల భూములను మాత్రం వదిలి పెట్టడం లేదని ఆరోపించారు. జాతీయ రహదారి రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టు కాదని, ఎకరాకు రూ.2 కోట్ల విలువ ఉందని ప్రభుత్వం గుర్తించిందన్నారు. అధికారులు కూడా రైతులందరి అభిప్రాయాలు సేకరించి అలైన్మెంట్ మార్చే ప్రయత్నం చేయాలని సూచించారు. ఈ భూముల్ని నమ్ముకునే ఇక్కడ రైతుల పిల్లలు ఉన్నత చదువులు చదువుకొని డాక్టర్లు, లాయర్లు, శాస్త్రవేత్తగా స్థిరపడినట్లు తెలిపారు. ఈ భూముల్లో ఏడాదికి మూడు పంటలు సాగవుతున్నాయని, అధికారులు మాత్రం ఒకే పంట సాగు అవుతున్నట్టు నివేది కలు ఇచ్చారని విమర్శించారు. ఇప్పటికైనా బలవంతపు భూ సేకరణ ఆపాలని డిమాండ్ చేశారు.
భూసేకరణ ఆవశ్యకతను గుర్తించాలి
సంధ్యారాణి, అదనపు కలెక్టర్ కొంత మంది రైతుల త్యాగాల వల్లనే నేడు సునాయాసంగా నేషనల్ హైవే రోడ్లపై ప్రయాణం చేస్తున్నామని, భూసేకరణ ఆవశ్యకతను రైతులు గుర్తించాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి రైతులకు సూచించారు. మంచిర్యాల కారిడార్‌లో 10 గ్రామాల్లో భూసేకరణ చేపట్టామని, వరంగల్, ఖమ్మం ప్రాజెక్టులో 180 కిలోమీటర్ల భూసేకరణ చేపడుతున్నట్టు తెలిపారు. గతంలో చేపట్టిన ప్రాజెక్టులకు కొంత మంది రైతులు భూమి కోల్పోవడం వల్లనే అభివృద్ధి జరిగినట్టు తెలిపారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కోసం వందల గ్రామాల రైతులు తమ భూములను కోల్పోయారని గుర్తు చేశారు. రహదారి నిర్మాణం వల్ల పొల్యూషన్, దుమ్ము ధూళి, వాతావరణ కాలుష్యం అవుతుందని, ఈ ప్రాజెక్టు వల్ల ముందస్తు చర్యలు చేపట్టడానికి పర్యావరణంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతు న్నట్టు తెలిపారు. రైతులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయాలని సూచించారు. అనంతరం ఎనిమిది గ్రామాల రైతుల అభిప్రాయాలను సేకరించారు. సమావేశంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ వెంకట నర్సు, ఆర్డీవో వాసుచంద్ర, పరకాల ఏసీపీజే శివరామయ్య, శాయంపేట, పరకాల, దామెర, ఆత్మకూర్ మండలాల తహసీల్దార్లు, పోలీస్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.