Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్న బీజేపీ
- 28న మండలకేంద్రాలు, పారిశ్రామిక వాడల్లో ర్యాలీలు, వంటావార్పులు
- 29న కలెక్టరేట్ల ఎదుట నిరసనలు: సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్
- ఎస్వీకేలో సమ్మె పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతన్న నేపథ్యంలో దేశ రక్షణ కోసం జరుగుతున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. 28న మండల కేందాల్లో, పారిశ్రామిక వాడల్లో వంటావార్పులు, ర్యాలీలు, సభలు, నిరసన ప్రదర్శనలు, 29న జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు, కలెక్టరేట్ల ముట్టడి చేయనున్నట్టు ప్రకటించారు. బుధవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమ్మె జయప్రదం కోరుతూ పోస్టర్ను ఆవిష్కరించారు. విష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కోవిడ్ సమయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కార్పొరేట్ల ఆదాయాలు 40 శాతానికిపైగా పెరిగిన తీరును వివరించారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసరాల ధరలు రోజురోజుకీ పెరిగిపోతుండటంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దేశ భవిష్యత్ అవసరాలను ఫణంగా పెట్టి బొగ్గుగనులు, సహజవనరులను కార్పోరేట్లకు అప్పనంగా కట్టబెట్టడం దుర్మార్గమని పేర్కొన్నారు. అవసరమున్నప్పుడు కార్మికులను తీసుకోవడం, అవసరం లేనప్పుడు తీసేయాలనే స్వేచ్ఛను యాజమాన్యాలకు మోడీ సర్కారు కట్టబెట్టడం దుర్మార్గమన్నారు. ఈ నెల 29న హైదరాబాద్లో ఇందిరాపార్కు వద్ద సభ నిర్వహిస్తామని తెలిపారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో గతంలో కంటే విజయవంతంగా సమ్మె నిర్వహణకు కృషి జరుగుతున్నదని చెప్పారు. సింగరేణి, ఆర్టీసీ, ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, ఎన్టీపీసీ, డోలమైట్, బెల్, బీడీఎల్, మిథాని, ఈసీఐఎల్, తదితర ప్రభుత్వ రంగ సంస్థల్లో వంద శాతం సమ్మె నిర్వహించేందుకు అన్ని కార్మిక సంఘాలను కలుపుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ రమ మాట్లాడుతూ..స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం, సామాజిక భద్రత కల్పించాలనీ, బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ తాము సమ్మెలోకి వెళ్తున్నామని తెలిపారు. ఉపాధ్యక్షులు ఆర్.కోటం రాజు మాట్లాడుతూ..రాష్ట్రంలోని 20 లక్షల మంది భవన నిర్మాణ రంగ కార్మికులు సమ్మెలోకి వెళ్తున్నారన్నారు. వెల్ఫేర్బోర్డులోని 39వేల కోట్లను ప్రయివేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టబెట్టే కుట్ర జరుగుతున్నదని విమర్శించారు. రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ..కోల్ ఇండియా ఒప్పందాలను సింగరేణి అమలు చేయట్లేదని తెలిపారు. కనీస వేతనాల జీవోలను విడుదల చేయాలనీ, సింగరేణిలోకి కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు పి.శ్రీకాంత్, పి.సుధాకర్, పి.సోమన్న, తదితరులు పాల్గొన్నారు.