Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజస్థాన్, చత్తీస్‌గడ్‌లో ఓపీఎస్ అమలుకు నిర్ణయం
- ఆ దిశగా ప్రయత్నాలట
- పంజాబ్ ఎన్నికల్లో కేజ్రీవాల్ హామీ
- రద్దు బాధ్యత రాష్ట్రాలదేనని కేంద్రం స్పష్టత
- తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం కోసం ఉద్యోగుల ఎదురుచూపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంట్రిబ్యూటరీ పింఛన్ స్కీం (సీపీఎస్) ఉద్యోగుల సామాజిక భద్రతకు విఘాతంగా ఉన్నది. దీంతో సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు 2004 నుంచి దాన్ని రద్దు చేయాలంటూ ఉద్యమిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతున్నారు. అయితే రాజస్థాన్, చత్తీస్‌ఘడ్‌లో ఇటీవల సీపీఎస్‌ను రద్దు చేస్తున్నట్టు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. పాత పింఛన్ విధానం (ఓపీఎస్) అమలుకు నిర్ణయం తీసుకున్నాయి. వామపక్షాలు అధికారంలో ఉన్నపుడు పశ్చిమబెంగాల్, కేరళ, త్రిపురలో సీపీఎస్‌ను అమలు చేయకుండా ఓపీఎస్‌ను కొనసాగించాయి. త్రిపురలో బీజేపీ, కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఓపీఎస్‌ను రద్దు చేసి, సీపీఎస్‌ను అమల్లోకి తెచ్చాయి. పశ్చిమబెంగాల్లో ఓపీఎస్ కొనసాగుతున్నది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆప్ అధినేత కేజ్రీవాల్ సైతం సీపీఎస్‌ను రద్దు చేస్తామంటూ హామీ ఇవ్వడంతోపాటు మ్యానిఫెస్టోలోనూ పొందుపరిచారు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో
ఆప్ సర్కారు భగవంత్‌మాన్ నేతృత్వంలో కొలువుదీరింది. అక్కడా త్వరలోనే ఓపీఎస్ అమలుకు చర్యలు చేపట్టే అవకాశమున్నది. ఆంధ్రప్రదేశ్‌లోనూ సీపీఎస్‌ను రద్దు చేస్తామంటూ ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. వచ్చేనెల నాలుగున ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని ఆయన ఆదేశించారు. ఇలా ఇతర రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు, ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతుండడంతో తెలంగాణలోని ఆ ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో ఆశలు చిగురించాయి. రాష్ట్రంలో 'సీపీఎస్' రద్దెప్పుడు? అన్న చర్చ విస్తృతంగా జరుగుతున్నది. సీపీఎస్‌ను రద్దు చేయాలన్న డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం 1.72 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
కేంద్రం పేరు చెప్పి రాష్ట్ర సర్కారు దాటవేత
సీపీఎస్ విధానం దేశంలో 2004, జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004, సెప్టెంబర్ 1 నుంచి అమలైంది. 2014, ఆగస్టు 23న న్యూ పింఛన్ స్కీం (ఎన్పీఎస్) ట్రస్టుతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని జీవో నెంబర్ 28ని విడుదల చేసింది. సీపీఎస్ విధానం అమలు వల్ల ఉద్యోగులకు సామాజిక భద్రత లేకుండా పోయింది. దీంతో సీపీఎస్‌కు వ్యతిరేకంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు అవిశ్రాంతంగా ఉద్యమిస్తూనే ఉన్నారు. అయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఉమ్మడి రాష్ట్రం నుంచే సీపీఎస్‌ను ఉద్యోగులు వ్యతిరేకించారు. అప్పటి ప్రభుత్వాలు దాటవేత ధోరణిని అవలంభించాయి. తెలంగాణ వచ్చాక ఈ అంశం తమ పరిధిలో లేదనీ, దీనిపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాంటూ ఇంతకాలం రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ వచ్చింది. కానీ, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేసుకునే అధికారం రాష్ట్ర్ర ప్రభుత్వాలదేనంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకే రాజస్థాన్, చత్తీస్ఘడ్ ప్రభుత్వాలు సీపీఎస్‌ను రద్దు చేయడమే ఇందుకు నిదర్శనం. సీపీఎస్ రద్దు పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇంత కాలం ఉద్యోగులను మోసం చేసిందన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సీపీఎస్‌ను రద్దు చేయాలంటూ ఉద్యోగులు ఒత్తిడి పెంచనున్నారు.
షేర్ మార్కెట్‌ను బట్టి సీపీఎస్ ఉద్యోగి పింఛన్
ఓపీఎస్ కింద ఉన్న ఉద్యోగులకు రిటైరయ్యాక ప్రతి నెలా సర్వీస్ పింఛన్ అందుతున్నది. అంటే.. ఉద్యోగి రిటైరైన చివరి నెలలో ఉన్న వేతనంలో 50 శాతాన్ని సర్వీస్ పింఛన్ కింద ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఒకవేళ పింఛనర్ చనిపోతే.. అతని భార్యకు, ఆ తర్వాత వారిపై ఆధారపడే దివ్యాంగులైన, పెళ్లికాని పిల్లలకు పింఛన్ సొమ్ము అందుతున్నది. చివరి నెలలో రూ.50 వేల వేతనం ఉంటే నెలకు రూ.25 వేల వరకు పింఛన్ వస్తున్నది. ఇది కుటుంబ పోషణకు, జీవితం చివరి దశలో పింఛనర్లకు బాసటగా ఉంటున్నది. కానీ, సీపీఎస్‌లో ఈ సౌకర్యం లేదు. సీపీఎస్ అనేది ఉద్యోగి చందా ఆధారిత స్కీమ్. ఈ స్కీమ్ కింద ఉద్యోగుల మూలవేతనం, డీఏ (కరువు భత్యం)ల నుంచి ప్రతినెలా 10 శాతం చొప్పున కట్ చేస్తారు. ప్రభుత్వమూ మరో 10 శాతం చందాను కలుపుతుంది. ఈ మొత్తాన్ని ఎన్పీఎస్-ఎన్ఎస్డీఎల్కు బదిలీ చేస్తారు. అక్కడ ఉద్యోగి 'పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ (ప్రాన్)'లో జమ చేస్తారు. దీనిని ఎన్ఎస్డీఎల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న బ్యాంకులకు బదిలీ చేసి, అక్కడి నుంచి షేర్ మార్కెట్లో ఆ సొమ్మును పెడతారు. ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత అప్పటివరకు ప్రాన్‌లో జమ అయిన మొత్తం సొమ్ము నుంచి ఉద్యోగికి 60 శాతం చెల్లించేస్తారు. మరో 40 శాతం సొమ్మును షేర్ మార్కెట్లోనే కొనసాగిస్తూ వచ్చే లాభ నష్టాలతో కలిపి ఎంతో కొంత ప్రతి నెలా పింఛన్ రూపంలో చెల్లిస్తారు. దీని ద్వారా ఉద్యోగులకు ఒక్కోసారి రూ.రెండు వేలు, రూ.వెయ్యి, రూ.1500 పింఛన్ వచ్చిన సందర్భాలున్నాయి.
సీపీఎస్‌ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి : చావ రవి
సీపీఎస్ విధానం బీజేపీ అధికారంలో ఉన్నపుడు తెచ్చిందని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి విమర్శించారు. సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కుటుంబాల సామాజిక భద్రతకు ఇది శాపంగా ఉందన్నారు. దీన్ని రద్దు చేయడం విజ్ఞత కలిగిన ప్రభుత్వాల బాధ్యత అని చెప్పారు. వామపక్ష పార్టీలు అధికారంలో ఉన్నపుడు పశ్చిమబెంగాల్, కేరళ, త్రిపురలో సీపీఎస్‌ను అమలు చేయలేదనీ, ఓపీఎస్‌ను కొనసాగించాయని గుర్తు చేశారు. ఉమ్మడి ఏపీలో వైఎస్ ఏకపక్షంగా సీపీఎస్‌ను అమల్లోకి తెచ్చారని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
కార్పొరేట్లకు మేలు చేసే సీపీఎస్‌ను రద్దు చేయాలి : స్థితప్రజ్ఞ
కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసే పార్టీలు ప్రవేశ పెట్టిన ఈ సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని టీఎస్సీపీఎస్ఈయూ అధ్యక్షులు గంగాపురం స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి, ఓపీఎస్‌ను పునరుద్ధరించి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ పక్షపాతి అని నిరూపించునే సమయం ఆసన్నమైందని చెప్పారు. రాజస్థాన్, చత్తీస్ఘడ్ ప్రభుత్వాలు పాతపింఛన్ విధానాన్ని ప్రవేశపెట్టడం హర్షణీయమని అన్నారు. అదే తర హాలో రాష్ట్రంలోనూ ఓపీఎస్‌ను పునరుద్ధరించి దేశా నికే తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలవాలని కోరారు.