Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11 మంది వలసకూలీల మృతి...
- సికింద్రాబాద్ బోయిగూడలోని స్క్రాప్ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం
- హడావిడిగా పోస్టుమార్టం
- అంతా బీహార్‌కు చెందిన వారే..
పొట్ట చేతపట్టుకుని బతుకు దెరువు కోసం బస్తీకి వచ్చారు. తమకు పని ఇచ్చిన స్క్రాప్ దుకాణమే ప్రాణాలు తీస్తుందని వాళ్లు అనుకోలేదు. రాత్రి పడుకునే ముందు బీహార్ లో ఉన్న తమ బంధువులతో మాట్లాడారు. సహచర కార్మికులతో కబుర్లు చెప్పుకున్నారు. రాత్రి గాఢనిద్రలో ఉన్నప్పుడు అమాంతంగా మంటలు చెలరేగాయి. గేటుకు తాళం వేసి ఉండటం, మరోవైపు శారీరక బడలికతో ఉండటంతో ప్రమాదాన్ని గుర్తించలేదు. అంతే ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఆ మంటల్లోనే 11 మంది సజీవ దహనమయ్యారు. జంటనగరాల్లో భద్రత లేని బతుకులకు భరోసా ఎవరిస్తారంటూ కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
నవతెలంగాణ-సిటీబ్యూరో/బేగంపేట్
సికింద్రాబాద్ బోయిగూడలోని ఓ స్క్రాప్ గోడౌన్లో ఘోర ప్రమాదం జరిగింది. రాత్రి నిద్రపోయిన కార్మికుల బతుకులు తెల్లారేసరికి బుగ్గిపాలయ్యాయి. బుధవారం తెల్లవారుజామున షార్ట్‌సర్క్యూట్‌తో భారీ అగ్ని ప్రమాదం జరగడంతో.. 11 మంది వలస కార్మికులు సజీవ దహనమయ్యారు. మృతులంతా బీహార్ రాష్ట్రానికి చెందినవారే. పొట్టచేతబట్టుకొని బతుకుదెరువు కోసమని సిటీకొచ్చి బోయిగూడలోని శ్రావణి ట్రేడర్స్ ప్లాస్టిక్ గోడౌన్ (స్క్రాప్ గోడౌన్)లో పనిచేస్తున్నారు. గోడౌన్లోనే నివాసం ఉంటున్నారు. తెల్లవారుజాము 3:30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో 11 మంది నిద్రలో ప్రాణం వదిలారు. విషయం తెలియగానే మంత్రులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు.
బోయిగూడలో 'శ్రావణి ట్రేడర్స్' ప్లాస్టిక్ గోడౌన్ (స్క్రాప్గోడౌన్) 10 ఏండ్లుగా కొనసాగుతోంది. ఎలాంటి పర్మిషన్లు లేకుండానే నిర్వహిస్తున్నారు. బుధవారం షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో గ్రౌండ్ ఫ్లోర్లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఆ సమయంలో పై అంతస్తులోని మూడు గదుల్లో 12 మంది కార్మికులు నిద్రిస్తున్నారు. మంటలను చూసి భయబ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. మొదట గాంధీ ఆస్పత్రిలో అందుబాటులో వున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేప్రయత్నం చేశారు. అప్పటికే భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మరో 7 ఫైర్ ఇంజన్లను రగంలోకి దించారు. రేకుల షెడ్‌తో గోదాంను నిర్మించడం, అందులో నుంచే పైకి (ఇనుప మెట్లు) ఉండటంతో భారీగా ప్రాణనష్టం చోటుచేసుకుంది. కార్మికులు ఇనుప మెట్ల పై నుంచి కిందకు రాలేకపోయారు. దానికి తోడు భారీఎత్తున మంటలు చెలరేగడం, దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఊపిరాడక కార్మికులు స్పృహకోల్పోయారు. ఆ తర్వాత 11 మంది సజీవదహనయ్యారు. మరో కార్మికుడు కిటికీలోనుంచి బయటకు దూకడంతో ప్రాణంతో బయటపడ్డాడు. రెస్క్యూ టీమ్ ఆ 11 మంది కార్మికుల మృతదేహాలను బయటికి తీయగలిగింది. ఘటనా స్థలంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
స్నేహితునికి ఫోన్... ప్రాణాలతో బయటపడిన కార్మికుడు
గోడౌన్లో చనిపోయిన 11 మంది కార్మికులతోపాటు ప్రేమ్ అనే యువకుడు కూడా ఉంటున్నాడు. మంటలు, పొగను చూసి పై అంతస్తులోని కిటికీ గ్రిల్స్ తొలగించి కిందకు దూకడంతో ప్రేమ్ తీవ్రంగా గాయపడ్డాడు. భయాందోళనకు గురైన ప్రేమ్ అంబర్‌పేట్‌లో నివాసముంటున్న స్నేహితుడు బర్మాదేవ్కు ఫోన్ చేసి విషయం చెప్పి కొద్ది దూరంలో స్పృహకోల్పోయి పడిపోయాడు. ఆలస్యంగా గుర్తించిన పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 11 మంది మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించారు. గోదాము యజమాని సంపత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రభుత్వం న్యాయం చేయాలి:
బాధితుల కుటుంబసభ్యులు
మృతులంతా బీహార్ వాసులుగా పోలీసులు గుర్తించారు. బిట్టు(23), సికిందర్(40), దరోగా కమార్ అలియాజ్ దినేష్(35), దామోదర్ మహాల్ (27), సింటు (27), సికిందర్, రాజేష్(25), రాజు (25), దీపక్(26), పంకజ్(26), సత్యేందర్(40)గా గుర్తించారు. ఘటన గురించి తెలుసుకున్న బీహార్‌లోని చాప్రా జిల్లా వాసులతోపాటు హైదరాబాద్‌లో నివాసముంటున్న బాధితుల కుటుంబీకులు గాంధీ మార్చురీ వద్దకు పెద్దఎత్తున చేరుకున్నారు. సత్యేందర్, దీపక్‌కు వివాహం అయింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని, అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.
ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుంది: మహమూద్ అలీ
అగ్నిప్రమాద సంఘటనపై హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు. హైదరాబాదులో ఇలాంటి గోదాంలు ఎన్ని ఉన్నాయో, ఎలాంటి చర్యలు చేపట్టాలో చర్చిస్తామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలూ తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. గోదాం యజమాని నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని, అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఖర్చులతోనే మృతదేహాలను బీహార్‌కు తరలిస్తామన్నారు. ఆ కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
హోంమంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం
ఘటనా స్థలానికి వచ్చిన హోంమంత్రి మహమూద్ అలీకి తృటిలో ప్రమాదం తప్పింది. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి అదనపు సీపీ డీఎస్ చౌహాన్‌తో కలిసి గోడౌన్ నుంచి బయటకు వచ్చిన 5 నిమిషాల్లోనే గోడౌన్ బీమ్ కుప్పకూలింది. అయితే, ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సమీపంలోని అందరినీ పంపించి వేశారు.
మృతుల కుటుంబాలకు నష్టపరిహారం: సీఎస్
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లిస్తామని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.
ప్రమాద ఘటన దురదృష్టకరం: మంత్రి తలసాని
అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం దురదృష్టకరమని మంత్రి తలసాని అన్నారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై మంత్రి ఆరా తీశారు.
3:55 నిమిషాలకు ఫోన్ వచ్చింది
ఉదయం 3:55 నిమిషాలకు ఫోన్ వచ్చిందని జిల్లా ఫైర్ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గోదాంలో అగ్నిప్రమాదం సంభవించిందని మనోహర్ అనే వ్యక్తి ఫోన్ చేసి చెప్పారన్నారు. వెంటనే తాము గాంధీ ఆస్పత్రిలోని ఫైర్ ఇంజన్లను రంగంలోకి దించామన్నారు. ముషీరాబాద్, సెక్రటేరియట్, గౌలిగూడ, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో 8 ఫైర్ ఇంజలను రంగంలోకి దించామన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, ఎండాకాలం కావడంతో జాగ్రత్తగా ఉండాలన్నారు.
గోడౌన్లో ప్రమాద నివారణ చర్యల్లేవు : సీపీ
స్క్రాప్ గోదాం నిర్వహణ సరిగ్గా లేదని, ఎటువంటి సేఫ్టీ నిబంధనలు పాటించలేదని, అందులో ప్రమాద నివారణ చర్యలు ఏమీలేవని సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. కార్మికులంతా నిద్రలో ఉన్నప్పుడు అగ్నిప్రమాదం జరగడంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉందన్నారు. గ్యాస్ సిలిండర్ పేలినట్టు 100కు ఫోన్‌కాల్ వచ్చిందని చెప్పారు. సిలిండర్ పేలడంతోనే మంటలు ఎక్కువగా వ్యాపించాయని చెప్పారు. కింద ఫ్లోర్లో తుక్కుసామాను వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని వెల్లడించారు. ప్రేమ్ అనే యువకుడు పైనుంచి దూకి ప్రాణంతో బయటపడ్డాడన్నారు. మృతులు బీహార్‌లోని చాప్రా జిల్లాకు చెందినవారని తెలిపారు.
పట్టించుకోని అధికారులు : స్థానికుడు శైలేందర్
బోయిగూడలో 50కిపైగా గోదాంలు, టింబర్ డిపోలు అనధికారికంగా కొనసాగుతున్నాయి. గతేడాది సైతం ఈ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది తీవ్రంగా నష్టం వాటిల్లింది. పర్మీషన్ లేకుండానే గోడౌడ్లు, టింబర్ డిపోలు కొనసాగుతున్నాయి. సంఘటన జరిగిన సమయంలోనే అధికారులు హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత పరిస్థితులు మామూలుగానే మారిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి.
పోస్టుమార్టం ప్రక్రియలో మొత్తం 4 టీమ్‌లు
గాంధీ మార్చురీలో బోయిగూడ అగ్నిప్రమాద మృత దేహాల గుర్తింపు, డెడ్ బాడీలు పాడవకుండా ఎంబామింగ్, పోస్టుమార్టం మూడు ప్రక్రియలను ఏకకాలంలో వైద్యులు చేపట్టారు. పోస్టుమార్టం ప్రక్రియలో మొత్తం నాలుగు టీంలు పాల్గొన్నాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని హైదరాబాద్ కలెక్టర్, సీపీ సీవీ ఆనంద్ పర్యవేక్షిస్తున్నారు.
యజమాని నిర్లక్ష్యమే : ప్రేమ్‌కుమార్
స్క్రాప్ గోడౌన్ యజమాని నిర్లక్ష్యమే అగ్ని ప్రమాదానికి కారణమని ఆ ఘటన నుంచి తప్పించుకుని ప్రాణంతో బయటపడిన ప్రేమ్‌కుమార్ తెలిపాడు. తాను రెండేండ్లుగా గోదాంలోనే పనిచేస్తున్నానని, తనతో పాటు 11 మంది గోదాం పై అంతస్తులో నిద్రపోయామని చెప్పాడు. చిన్న రూమ్‌లో తాను, బిట్టు, పంకజ్ ఉన్నామని, మరో రూమ్‌లో మిగతా 9 మంది కార్మికులు పడుకున్నారని చెప్పాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో పొగలతో మంటలు వచ్చాయని, బయటకు వెళ్లేందుకు ప్రయత్నిం చామని, కానీ మంటలు పెద్దఎత్తున వ్యాపించాయని అన్నాడు. తాను కిటికీలోంచి బయటకు దూకానన్నాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారని తెలిపాడు. అప్పటికే తన తోటి వాళ్లంతా చనిపోయార న్నాడు. ప్రేమ్‌కుమార్ ఫిర్యాదుతో బోయిగూడ అగ్నిప్రమాదంలో స్క్రాప్ యజమాని సంపత్‌పై 304 ఏ, 337 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.