Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చుడే..ఇంటికెళ్లే దాకా ప్రాణం మీద డౌటే
- పనిప్రదేశాల్లోనే ప్రమాదకర పరిస్థితుల్లో జీవనం
- బయటి ముఖం ఎరుగరు..ఉన్నట్టూ తెలియదు..
- కార్పొరేట్ల కోసం వలసకార్మికుల హక్కులను తాకట్టుపెట్టిన కేంద్రం
- చస్తే మాకేంటి..లాభాలే ముఖ్యమన్నట్టుగా యాజమాన్యాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పాలకుల అలసత్వం..యాజమాన్యం నిర్లక్ష్యం 11 మంది వలసకార్మికులను బలిగొంది. ఓవైపు ఎగిసిపడుతున్న మంటలు..ఇంకోవైపు కమ్ముకున్న పొగతో నిద్రలోనే సజీవదహనమయ్యారు. పట్టెడన్నం కోసం కానరాని రాజ్యమొచ్చి యాజమాన్యాల లాభాల కుప్పల మధ్యలో ఎటూ వెళ్లలేక ప్రాణాలు కోల్పోవటం పాలకుల విధానపర లోపాన్ని ఎత్తిచూపుతున్నది. రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కు లేకుండా పోతున్నదనే విషయాన్ని సికింద్రాబాద్ బోయగూడ ప్రమాద ఘటన రుజువు చేస్తున్నది. ఇదే కాదు..క్షేత్రస్థాయిలో ఏ పరిశ్రమకెళ్లినా ఇదే పరిస్థితి. ప్రమాదంతో ఇది బయటపడింది..అవి బయటపడలేదు. మిగతాదంతా సేమ్టూసేమ్. వలస కార్మికులు ఎక్కడ పనిచేస్తున్నారు? ఏ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు? కనీసం తిండీ,నివాస సౌకర్యాలున్నాయా? పరిశ్రమలు రిజిష్ట్రర్లను మెయింటెన్ చేస్తున్నాయా? లేవా? ఇవేవీ తమకు పట్టదన్నట్టుగా కార్మిక శాఖ వ్యవహరిస్తుండటం...కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమూ వలస కార్మికుల చట్టం అమలు చేయాల్సిన అవసరం లేదని ప్రకటించడంతో వారి జీవనం కుడితిలో పడ్డ ఎలుక చందంగా తయారైంది. పరిశ్రమల యాజమాన్యాలతో లాలూచీ పడి ఫ్యాక్టరీ సరైన ఎత్తులో ఉందా? సరిపడ విస్తీర్ణం ఉందా? ప్రమాదం జరిగితే నష్ట నివారణకు అనుగుణంగా ఏర్పాట్లు ఉన్నాయా? తదితరాలను పట్టించుకోవాల్సిన ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ నిద్రమత్తులో జోగుతున్నది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేయడం.. వలస కార్మికులు చనిపోతే బాధిత కుటుంబాలకు ఎంతో కొంత ఇచ్చి చేతులు దులుపుకుకోవటం పాలకులకు షరామామూలైపోయింది. క్షేత్రస్థాయిలో పనిప్రదేశాల్లోని ఇరుకు గదుల్లో వారు పడుతున్న వ్యథలు.. ప్రాణాలు కోల్పోతున్న తీరును ప్రభుత్వం పట్టించుకుంటున్న పాపాన పోవట్లేదు. దీంతో పనికి వచ్చుడే తప్ప..సొంత రాష్ట్రానికి వెళ్లేదాకా ప్రాణముండేది డౌటే అన్నట్టుగా పరిస్థితి తయారైంది. సొంతరాష్ట్రం కార్మికులైతే ఎక్కువ వేతనాలు ఇవ్వాలి. దీంతో లాభం తగ్గుతుంది. అదే వేరే రాష్ట్రం నుంచి తీసుకొస్తే తక్కువ వేతనం..ఎక్కువ లాభం.. బెదిరించి పనిచేయించు కున్నా అడిగేటోళ్లు ఉండరు. వీటిని ఆసరాగా చేసుకుని రాష్ట్రంలోని పరిశ్రమల యాజమాన్యాలు వలస కార్మికులవైపే దృష్టిసారిస్తున్నాయి. రాష్ట్రంలో పారిశ్రామిక, భవన నిర్మాణ రంగంలో పనిచేసేవారిలో నూటికి 70 మందికిపైగా వలసకార్మికులే ఉన్నారు. వారికిచ్చే వేతనం పదివేల రూపాయల లోపే. అదీ నెలవారీగా కాకుండా రోజువారీ వేతనంగా చెల్లిస్తున్న పరిస్థితి క్షేత్రస్థాయి లో ఉంది. పూర్తిగా కాంట్రాక్టర్లు, యజ మానుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. చాలా వరకు పరిశ్రమల్లోనే రేకులతో బాత్రూమ్ల సైజులో రూములు నిర్మించి వాటిలో కార్మికులను కుక్కి ఉంచుతున్నారు. అక్కడే పనిచేయడం, తినడం, పడుకోవడంతో ఆ కార్మికులకు బాహ్యప్రపంచంతో పెద్దగా సంబంధా లు ఉండట్లేదు. ఆ రూముల్లో ఎలుకలు, పంది కొక్కులు తిరిగాడుతూ పందుల దొడ్లను తలపించే ఆ రూములను సీఐటీయూ ఎత్తిచూపినా సర్కారు పట్టించుకోలేదు. కొన్ని పరిశ్రమల్లో వారిని ఎతైన గోడలు, రేకుల షెడ్ల గోడౌన్లలో బందీలుగా ఉంచు తున్నారు. దానికీ వసతి పేరుతో అద్దె తీసుకుంటు న్నారు. భోజన, నీళ్ల ఖర్చుల కింద కోతపెడుతు న్నారు. అంతా పోనూ వలస కార్మికులు ప్రతి నెలా నాలుగైదు వేలు కూడా మిగలని దుస్థితి ఉంది.
కెమికల్, ఫార్మా, స్క్రాప్, టింబర్ డిపోలు, ఐరన్, స్టీల్, బ్యాటరీ, లెడ్, తదితర పరిశ్రమల్లో కనీస జాగ్రత్తలు పాటించకుండానే యాజమా న్యాలు కార్మికులతో పనిచేయిస్తున్నాయనే విషయాన్ని సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన కార్మిక గర్జన పాదయాత్ర ఎత్తిచూపిన విషయం విదితమే. 'ఇక్కడ కార్మికుడు చనిపోయినా యజమానులు పట్టించు కోరు. ప్రశ్నించొద్దు. ఎవరి పని వాళ్లు చేసుకోవాల్సిందే. లేకుంటే పనిలో నుంచి తీసేస్తరు. కేసులు పెట్టి వేధిస్తారు. మాదేమో సొంత రాష్ట్రం కాదు. మూసుకుని పనిచేయాల్సిందే' పాదయాత్ర సందర్భంగా ఓ కార్మికుడు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాల్సిందే. ఒకరిద్దరు చనిపోతే అతను చెప్పినట్టే యాజమాన్యాలు బయటకు పొక్కనివ్వడం లేదు. బోయిగూడ లాంటి పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడే చావుల సంఖ్య చెబుతున్నారుగానీ మిగతా అన్ని సందర్భాల్లోనూ కప్పి ఉంచుతున్న పరిస్థితి.
కోవిడ్-19 వలస కార్మికుల జీవితాలను మరింత తలక్రిందులు చేసింది. అంతరాష్ట్ర్ర వలస కార్మికుల చట్టం (ఐఎస్ఎండబ్ల్యు)-1979 ప్రకారం వలస కార్మికుల రిజిస్ట్రేషన్ (స్వరాష్ట్రంలో, పనిచేస్తున్న రాష్ట్రంలో కార్మిక శాఖ వద్ద), వారు పనిచేస్తున్న పరిశ్రమల రిజిస్ట్రేషన్ వారిని కాంట్రాక్ట్ కార్మికులుగా తరలిస్తున్న కాంట్రాక్టర్ల లైసెన్సింగ్ మొదలైన బాధ్యతలను ప్రభుత్వం, యాజమాన్యాలు నిర్వర్తించాలి. దీనివల్ల వలస కార్మికులకు కొంతైనా భద్రత ఉండేది. ఈ చట్టాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో వలస కార్మికుల విషయంలో పరిశ్రమల యాజమాన్యాలు ఆడిందే ఆట..పాడిందే పాట అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. సీఐటీయూతో పాటు కేంద్ర కార్మిక సంఘాలన్నీ ఐఎన్ఎండబ్ల్యు చట్టాన్ని (వలస కార్మికుల చట్టం) పునరుద్ధరించి, పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. సుప్రీం కోర్టు కూడా వారిని పనిలో పెట్టుకుంటున్న యాజమాన్యాలు తప్పనిసరిగా రిజిస్టరై ఉండాలని, కాంట్రాక్టర్లకు లైసెన్సులు జారీ చేయాలని నొక్కి చెప్పింది. అంతేకాక కాంట్రాక్టర్లందరూ వలస కార్మిక చట్టాన్ననుసరించి వారి వివరాలను నమోదు చేయాలని, సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించింది. అలాగే చట్టంలో పేర్కొన్న అన్ని బాధ్యతలను తప్పనిసరిగా అమలు చేసేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ, క్షేత్రస్థాయిలో ఇవేమీ అమలు కావడం లేదు.
బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలి : సీఐటీయూ
సికింద్రాబాద్లోని బోయగూడలోని గోడౌన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది వలస కార్మికులు మరణించిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ ఒక ప్రకటనలో పేర్కొనారు. బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. యాజమా న్యాన్ని కఠినంగా శిక్షించాలని కోరారు. వలస కార్మికుల చట్టాలు అమలయ్యేలా చూడాలని విన్నవించారు. భవిష్యత్లో ఇటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలనీ, రాష్ట్రంలో అనుమతులు లేని వాటిని మూసివేయాలని సూచించారు. కార్మికులకు రక్షణ చర్యలులేని పని స్థలాల్లో పని చేయించకుండా కార్మిక శాఖ తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వా నికి విజ్ఞప్తి చేశారు. పరిశ్రమలిచ్చే సెల్ఫ్ డిక్లరేషన్ విధానాన్ని ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఇన్స్పెక్టర్ విధానాన్ని కొనసాగించాలని కోరారు.