Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసినందుకు సీఎం కేసీఆర్కు డాక్టర్లు, ఫార్మాసిస్టులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు గురువారం తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ (టీపీహెచ్డీఏ) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కత్తి జనార్థన్, తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ సభ్యులు ఆకుల సంజరు రెడ్డి వేరు వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్యశాఖలో ఒకేసారి 10,028 పోస్టుల భర్తీకి ముందుకు రావడం పట్ల జనార్థన్ హర్షం వ్యక్తం చేశారు. కొత్త నియామకాలతో ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బందిపై పని భారం తగ్గుతుందని తెలిపారు. ఇప్పటికే పేదలకు మెరుగైన వైద్యం అందిస్తూ ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులేస్తున్న సర్కారుకు భారీ స్థాయిలో సిబ్బంది సమకూరితే మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. ఇప్పటికే నిటి అయోగ్ హెల్త్ ఇండెక్స్ ర్యాంకింగ్స్లో దేశంలో మూడో స్థానంలో నిలిచిన తెలంగాణ, రాష్ట్ర సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలతో మొదటి స్థానం చేరుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రజలందరికి తెలిసేలా త్వరలోనే రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు.
ప్రభుత్వ ఫార్మసీ రంగాన్ని బలోపేతం చేసేలా పోస్టుల భర్తీ కోసం సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారని ఆకుల సంజరు రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 442 ఫార్మాసిస్టు, 18 డ్రగ్ ఇన్స్పెక్టర్, 15 జూనియర్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి రాష్ట్ర సర్కారు జీవోలు ఇచ్చిన సంగతి తెలిసిందే.