Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామాన్యుల నడ్డివిరుస్తున్న ప్రభుత్వాలు
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
అడ్డూ అదుపు లేకుండా రికార్డు స్థాయిలో విద్యుత్, ఇంధన, నిత్యావసర వస్తువుల ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతూ సామాన్యుల నడ్డివిరుస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. పెంచిన విద్యుత్, పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ గురువారం హైదరాబాద్ హిమాయత్‌నగర్ వై జంక్షన్లో సీపీఐ హైదరాబాద్ జిల్లా సమితి ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్భంగా చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరల పెరుగుదలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ప్రధాని మోడీ ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అంచుకు నెట్టబడిందని, తరచూ ధరల పెరుగుదలతో ప్రజలకు మూడు పూటల భోజనం కరువైతుందని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేయకుండా.. ధరలు పెంచి మోయలేని భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగానే విద్యుత్ వినియోగదారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెరుగుదల సామాన్య ప్రజల బడ్జెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని, దీని కారణంగా కూరగాయలు, పండ్లు, కిరాణా వస్తువులు, బియ్యం, రోజువారీ ఉపయోగించే ఇతర వస్తువులు ఖరీదైనవిగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ప్రజల ఆదాయంలో ఏ మాత్రం పెరుగుదల లేదన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో సామాన్య ప్రజలపై మోడీ ప్రభుత్వంకొరడా ఝలిపిస్తోందన్నారు. ధరలను వెంటనే తగ్గించకపోతే భవిషత్తులో పోరాటాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ అజీజ్ పాషా మాట్లాడుతూ.. ధరల పెంపుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోలియం ఉత్పత్తులు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నియంత్రించడంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు విఎస్.బోస్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర కార్మిక, కర్షక, ప్రజా వ్యతరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 28,29 తేదీల్లో జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈటి. నరసింహా, రాష్ట్ర సమితి సభ్యులు పి.ప్రేమ్‌పావని, ఎస్.ఛాయాదేవి, ఆర్.శంకర్‌నాయక్, ఎం.నరసింహా, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ఏ. మన్నన్, టి.రాకేష్‌సింగ్, ఏఐఎస్ఎఫ్ జాతీయ నాయకులు బి. స్టాలిన్ తదతరులు పాల్గొన్నారు.