Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్
- ఆవిష్కరణలకు నిలయం ఐఐటి హైదరాబాద్
నవ తెలంగాణ-కంది
విద్యార్థులు నూతన ఆవిష్కరణల ఒరవడిని సృష్టించాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర రాజన్ పిలుపునిచ్చారు. గురువారం సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటి హెచ్ (భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ, హైదరాబాద్)లో జీవన్ లైట్ స్మార్ట్ ఐసీయూ మెడికల్ వెంటిలేటర్లను గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల నూతన పరిశోధనల ఆవిష్కరణలకు ఐఐటీ హైదరాబాద్ నిలయమని తెలిపారు. నూతనంగా ఆవిష్కరించిన వెంటిలేటర్‌ను చూడగానే ఒక డాక్టర్‌గా తనకు ఎంతో సంతోషం కలిగిందన్నారు. కానీ వెంటిలేటర్లను వినియోగించే అవసరం రాకూడదని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఆశించారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో వెంటిలేటర్స్, బెడ్స్ అవసరం అత్యధికంగా ఏర్పడిందని, చిన్నచిన్న వైద్య పరికరాల కోసం ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు. ప్రధాని మోడీ స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా పేరిట నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వణికించిన కోవిడ్‌ను భారతదేశంలో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, 180 కోట్ల మందికి వ్యాక్సిన్‌ను అందించామన్నారు. అలాగే 150 దేశాలకు మన దేశం నుంచి వైద్య పరికరాలు, వ్యాక్సిన్, మందులు సరఫరా చేశామని చెప్పారు. ఎలాంటి వైపరీత్యాలనైనా ఎదుర్కొనేలా నూతన టెక్నాలజీని తయారు చేసి దేశం గర్వపడేలా భారత విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేయాలని సూచించారు. వెంటిలేటర్ తయారు చేసిన విద్యార్థులు రాజేష్, సిరిల్‌ను గవర్నర్ అభినందించారు. అనంతరం గవర్నర్‌కు జీవన్ లైట్ వెంటిలేటర్లు పదింటిని పాండిచ్చేరి ప్రభుత్వానికి ఇవ్వడానికి అందజేశారు. ఏరోబయోసిస్ ఆవిష్కరణలకు సంబంధించి ఏర్పాటుచేసిన స్టాళ్లను గవర్నర్ సందర్శించి పరిశీలించారు. కార్యక్రమంలో ఐఐటి హెచ్ చైర్మెన్ బీవీఆర్ మోహన్ రెడ్డి, డైరెక్టర్, ప్రొఫెసర్ బీఎస్. మూర్తి, జిల్లా కలెక్టర్ హనుమంతారావు, జిల్లా ఎస్పీ రమణ కుమార్, ఫ్యాకల్టీ ప్రొఫెసర్లు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.