Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 28, 29 తేదీల్లో దేశ వ్యాప్త సమ్మెతో కేంద్ర ప్రభుత్వ మెడలు వంచాలి
- కార్మికులకు సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం. సాయిబాబు పిలుపు
నవ తెలంగాణ-జహీరాబాద్
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తోన్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని, ఈనెల 28, 29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సమ్మెతో కేంద్ర ప్రభుత్వ మెడలు వంచాలని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం. సాయిబాబు కార్మికులకు పిలుపునిచ్చారు. సార్వత్రిక సమ్మె జయప్రదం కోసం గురువారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని బీబీ కళ్యాణ మండపంలో నిర్వహించిన సదస్సులో ఆయన హాజరై ప్రసంగించారు. కోట్లాది కార్మికుల ప్రయోజనాలు కాదని, కేవలం పదుల సంఖ్యలో ఉన్న పెట్టుబడిదారులకు అనుగుణంగా కేంద్రం కార్మికులను బానిసత్వంలోకి నెట్టేలా నాలుగు లేబర్ కోడ్లను తెచ్చిందని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, కార్మిక చట్టాలను కాపాడాలని, ప్రయివేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. 28, 29 తేదీల్లో జరిగే దేశ వ్యాప్త సమ్మెలో హమాలీ కార్మికుడి నుంచి ఉత్పత్తిలో పాల్గొనే ప్రభుత్వ రంగ పరిశ్రమల కార్మికులు, ఉద్యోగుల వరకు పాల్గొంటున్నారని తెలిపారు.
అనంతరం కొండాపూర్ మండలంలో సార్వత్రిక సమ్మె జయప్రదం కోసం జరిగిన సభకు ఆయన హాజరై మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కార్మిక చట్టాలను నీరుగారుస్తోందని విమర్శించారు. కార్మిక హక్కులను కాలరాస్తూ కార్పొరేట్లకు ఊడిగం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదానీ, అంబానీలకు లక్షల కోట్ల రూపాయలు విలువజేసే ప్రభుత్వ రంగ సంస్థలను అప్పజేబుతోందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి వ్యతిరేకంగా, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం.. తదితర సమస్యలపై ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం, ఉపాధ్యక్షులు ఎస్.మహిపాల్, సహాయ కార్యదర్శి ప్రవీణ్, జహీరాబాద్ క్లస్టర్ కన్వీనర్ రాజిరెడ్డి, నాయకులు వంశీకృష్ణ, కనకరెడ్డి, నర్సింహారెడ్డి, గణేష్, తదితరులు పాల్గొన్నారు.