Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రోలు, డీజిల్ ధరల పెంపుతో పెరుగుతున్న అప్పులు
- డిమాండ్ల సాధన కోసం 28, 29తేదీల్లో సమ్మెకు సై..
నవ తెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వేలాదిమంది ట్రాన్స్‌పోర్టు కార్మికుల జీవితాలను ఛిద్రం చేస్తోంది. ఆటో రిక్షా, క్యాబ్ డ్రైవర్లు, ట్రాక్టర్లు, లారీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇదే క్రమంలో నిత్యావసర సరుకుల ధరలు బాగా పెరిగాయి. ఒకవైపు రోజంతా కష్టపడి పనిచేసినా ఖర్చులూ రాని పరిస్థితిలో కార్మికులుంటే.. అక్రమ చలాన్లు, ఫైన్ల పేరుతో పోలీసులు, రవాణాశాఖ అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారు. వేధింపుల నుంచి తమను కాపాడాలని అనేకసార్లు ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఈనెల 28, 29 తేదీల్లో జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ట్రాన్స్‌పోర్టు కార్మికులు సిద్ధమవుతున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రవాణరంగ కార్మికులు సుమారు 2.50లక్షల మంది ఉన్నారు. వారిలో ఆటోట్రాలీ, క్యాబ్, డీసీఎం, స్కూల్‌బస్, అంబులెన్స్, ట్రాక్టర్, మినీ డీసిఎం, హయ్యర్బస్, జేసీబీ, ట్రక్కు, లారీ తదితర వాహనాలు నడుస్తున్నాయి. డీజిల్, పెట్రల్ ధరలు అధికంగా పెరగడం వల్ల ఆ వాహనాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేగాకుండా వాహనాల మరమ్మతులకు కావాల్సిన స్పేర్‌పార్ట్స్ ధరలను కూడా విపరీతంగా పెంచారు. కానీ వారి ఆదాయంలో ఎలాంటి మార్పులూ లేవు. ఆదాయం లేకపోగా ఖర్చులు అధికంగా పెరడం వల్ల రవాణ కార్మికులు అనేక మంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఉన్నాయి.
అందని ప్రభుత్వాల సహకారం
చదువుకున్న నిరుద్యోగులకు ఎలాంటి ఉపాధి లేకపోవడం వల్ల ఉన్నత విద్యావంతులైన వారు కూడా రవాణ రంగంలోకి వస్తున్నారు. కొంత నగదు పెట్టి.. మరికొంత ప్రయివేటు ఫైనాన్స్‌ల వద్ద అప్పులు తీసుకుని కార్లు, ఆటో రిక్షాలు కొనుగోలు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నారు. అయితే, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆటోల, కార్ల కిరాయిని మాత్రం ప్రభుత్వాలే నిర్ణయించడంతో గిట్టుబాటు లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చలాన్ల పేరుతో వేధింపులు
ఆటో, కార్లలో సీటుకు సరిపడా ప్రయాణికులనే తీసుకెళ్లాలంటే డీజిల్ ఖర్చులు కూడా రావడం లేదంటున్నారు. అదనంగా ప్రయాణికులను ఎక్కించుకుంటే రవాణ శాఖ అధికారులు పెద్దమొత్తంలో జరిమానాలు విధిస్తున్నారని కార్మికులు తెలిపారు. అనధికార స్థలంలో వాహనాలు నిలిపారంటూ చలాన్లు వేస్తున్నారు. ఇలా అయితే ఎలా బతకాలని కార్మికులు ఆవేదన చెందుతున్నారు.
సమ్మెకు సిద్ధమవుతున్న రవాణరంగ కార్మికులు
కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత దాదాపు ప్రతి నెలా డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతున్నారు. వాహనాలకు సంబంధించి మరమ్మతులకు అవసరమయ్యే స్పేర్‌పార్ట్స్ ధరలు పెరిగాయి. ఇన్సూరెన్స్ ప్రీమియం పెంపు, ప్రభుత్వం రోడ్లను ప్రయివేటు వాళ్లకు అప్పగించడంతో టోల్గేట్ ధరలు పెంచడం లాంటి వాటిని శరవేగంగా చేస్తున్నారు. కానీ రవాణరంగంలో పనిచేస్తున్న కార్మికుల ఆదాయంలో ఎలాంటి మార్పులూ చేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సమ్మె తప్ప మరో మార్గంలేక మార్చి 28,29తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమవుతున్నట్టు తెలంగాణ పబ్లిక్, ప్రయివేటు రోడ్ ట్రాన్సుపోర్టు వర్కర్స్ ఫెడరేషన్ కార్మికులు తెలిపారు.
రవాణ రంగ కార్మికుల డిమాండ్లు
- 2020 సంవత్సరంలో పెంచిన డీజిల్, పెట్రోల్ ఎక్సైజ్ సుంకాన్ని ఉపసంహరించుకోవాలి.
- 2019 ఎంవి చట్టాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలి.
- నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి.
- పోలీసులు, ఇతర అధికారుల వేధింపులను తక్షణమే ఆపాలి
- రవాణ రంగ కార్మికుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి
సమ్మెను జయప్రదం చేయాలి
రవాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు తీరాలంటే పోరాటం తప్ప మరో మార్గంలేదు. అందుకే దేశవ్యాప్తంగా ఈనెల 28, 29తేదీల్లో జరిగే సమ్మెలో పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలి.
- చిన్నపాక లక్ష్మినారాయణ, ఏఐఆర్‌టిడబ్ల్యూఎఫ్ జిల్లా కార్యదర్శి - నల్లగొండ.