Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 26 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
- సమర్పణకు తుదిగడువు ఏప్రిల్ 12
- నోటిఫికేషన్ విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జూన్ 12న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధ్యాయ ఉద్యోగం పొందాలంటే టెట్లో తప్పనిసరిగా ఉత్తీర్ణత పొందాలన్న విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర విద్యా, పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్, టెట్ కన్వీనర్ రాధారెడ్డి గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 26వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. దరఖాస్తుల సమర్పణకు తుదిగడువు వచ్చేనెల 12వ తేదీ వరకు ఉందని పేర్కొన్నారు. ఆన్లైన్లో ఈనెల 26 నుంచి వచ్చేనెల 11వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశముందని తెలిపారు. జూన్ 12న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. శుక్రవారం నుంచి పూర్తి సమాచారంతో కూడిన వివరాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఇతర వివరాల కోసం https://tstet.cgg.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.రాష్ట్రంలో 2017, జులై 23న చివరిసారిగా టెట్ రాతపరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో పేపర్-1కు 98,848 మంది హాజరుకాగా, 56,708 (57.37 శాతం) మంది అర్హత సాధించారు. పేపర్-2కు 2,30,932 మంది పరీక్ష రాస్తే 45,045 (19.51 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. అప్పటి నుంచి రాష్ట్రంలో టెట్ జరగలేదు. అప్పటి నుంచి డీఎడ్, బీఎడ్ పూర్తయిన అభ్యర్థులు టెట్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. 2011 నుంచి టెట్ అర్హత సంపాదిస్తే జీవితకాలం ఉంటుందని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(ఎన్సీటీఈ) ప్రకటించింది. అందుకనుగు ణంగా బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేసింది. దీంతోపాటు ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులూ అర్హులేనని స్పష్టం చేసింది. దీంతో ఈసారి దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశమున్నది.
మెమోలను వెబ్సైట్లో ఉంచాలి : రామ్మోహన్రెడ్డి
గతంలో టెట్ అర్హత పొందిన అభ్యర్థుల మెమోలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని తెలంగాణ డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు రావుల రామ్మోహన్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. 2011నుంచి 2017వరకు ఆరుసార్లు టెట్ నిర్వహి ంచారని గుర్తు చేశారు.మార్కుల వివరాలు, మెమోలు వెబ్సైట్లో ఉండేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.