Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్కీం వర్కర్లు సమరశంఖారావం పూరించాలి
- కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి: రాష్ట్ర కార్మిక సంఘాల నేతల డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 28,29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని రాష్ట్ర కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఆ సమ్మెలో స్కీం వర్కర్లు సమరశంఖారావం పూరించాలనీ, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈనెల 28న మండల కేంద్రాల్లో, 29న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, ప్రదర్శనలు, సభలు నిర్వహించాలని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐటీయూ శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎస్వీ రమ మాట్లాడుతూ స్కీం వర్కర్లు దేశంలో కోటి మంది, రాష్ట్రంలో మూడు లక్షల మంది ఉన్నారని వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో స్కీం వర్కర్లు కీలకపాత్ర పోషిస్తున్నారని చెప్పారు. వారిని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విస్మరిస్తున్నదని విమర్శించారు. వారు ఉద్యోగ, సామాజిక భద్రత లేక మనోవేదనకు గురవుతున్నారని అన్నారు. వారికి కనీస వేతనం రూ.26 వేలు, కనీస పింఛన్ రూ.10 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పనికితగ్గ వేతనం ఇవ్వకుండా, గౌరవ వేతనం అంటూ అగౌరవపరుస్తున్నారని విమర్శించారు. కొన్ని పథకాలను ప్రయివేటు సంస్థలను అప్పగించే కుట్ర జరుగుతున్నదని చెప్పారు. రైతుల ఉద్యమ స్ఫూర్తితో నాలుగు కార్మిక కోడ్లను రద్దు చేయాలంటూ ఐక్యంగా పోరాడతామని అన్నారు. ఎనిమిది గంటల పనివిధానాన్ని తొలగించి 12 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టడం సరైంది కాదన్నారు. దేశభక్తియుతమైన ఈ సమ్మెలో స్కీం వర్కర్లు ప్రతి ఒక్కరూ పాల్గొనాలనీ, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ప్రేమపావని మాట్లాడుతూ ఐసీడీఎస్‌లో పనిచేస్తున్న వారిని కార్మికులుగా గుర్తించకుండా కేంద్రం శ్రమదోపిడీ చేస్తున్నదని విమర్శించారు. ప్రజల ఆహారభద్రతకు విఘాతం కలిగించేలా విధానాలు రూపొందిస్తున్నదని చెప్పారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్తున్న మేడీ సర్కారు ఎవరి వికాసం కోసం పనిచేస్తున్నదని ప్రశ్నించారు. ఆజాదీకా అమృతోత్సవాల వల్ల మహిళలకు, కార్మికులకు ఒరిగిందేంటని అడిగారు. దేశంలో ఉపాధి అవకాశాలు తగ్గాయనీ, పేదరికం పెరిగిందని విమర్శించారు. టీఆర్ఎస్కేవీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి మాట్లాడుతూ ఐసీడీఎస్‌ను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్లు, వర్కర్లకు ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించాలని కోరారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు పోరాడతామని చెప్పారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం మాట్లాడుతూ పీఎఫ్‌లో కార్మికులు దాచుకున్న సొమ్ము ద్వారా నెలకు రూ.ఏడు వేల వరకు పింఛన్ ఇచ్చేందుకు అవకాశముందన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించడం లేదని చెప్పారు. కార్మికుల కాళ్లు కడిగి వారి పట్ల ఎంత గౌరవముందో అన్నట్టుగా ప్రధాని మోడీ డ్రామా ఆడారని విమర్శించారు. మధ్యాహ్న భోజనం కార్మికులకు నెలకు రూ.వెయ్యి గౌరవ వేతనంతో సమాజంలో ఎలాంటి గౌరవముంటుందని అన్నారు. ఉద్యోగులు, కార్మికుల భద్రత కల్పించాలనీ, హక్కులను కాలరాయొద్దంటూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ శ్రామిక మహిళా రాష్ట్ర నాయకులు మీనా, తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ఉపాధ్యక్షులు స్వప్న, టీఆర్ఎస్కేవీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సంతోషి, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.