Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త ట్రిబ్యునల్‌కు న్యాయశాఖ 'నో'
- కృష్ణాజలాల వివాదానికి అంతమెప్పుడు ?
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం మరోసారి మాట తప్పింది. కృష్ణా జలాల పంపిణీ విషయంలో కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే విషయాన్ని ఆలోచిస్తామని అటు అపెక్స్ కౌన్సిల్, ఇటు సుప్రీంకోర్టులో చెప్పిన కేంద్ర జలశక్తి శాఖ, న్యాయశాఖ సలహా పేరుతో అడ్డుకాలేసింది. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఉనిఖీలో ఉండగా మరో ట్రిబ్యునల్ అవసరం లేదని తేల్చేసింది. తద్వారా పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించినట్టయింది. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వానికి సాక్షాత్తు రాజ్యాంగ ధర్మాసనం ముందు, అత్యున్నత కమిటీ అయిన అపెక్స్ కౌన్సిల్లో ఇచ్చిన హామీకి తూట్లు పొడిచింది. తాజా నిర్ణయంతో కృష్ణా జలాల వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడున్నరేండ్లుగా ఈ సమస్య పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. జల వివాదాలపై సీఎం కేసీఆర్ గతంలో కేంద్రంపై విమర్శలు చేసిన నేపథ్యంలో ప్రతిగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చేసిన వ్యాఖ్యలు సైతం దుమారాన్ని రేపాయి. కృష్ణాజలాల నీటి వాటా పంపిణీకి సంబంధించి గత కొన్ని నెలలుగా రాష్ట్ర సాగునీటి పారుదల, ఆయకట్టు శాఖ, కృష్ణా నదీజలాల యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కు మధ్య పలులేఖలు నడిచాయి. ఇంకా కొనసాగుతున్నాయి. బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకోవాలని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ఆయా ప్రాజెక్టులను కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సబ్ కమిటీ సభ్యులు సందర్శించారు. బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులను ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేకున్నా, కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చిన నోటిఫికేషన్‌కు తలవంచక తప్పలేదు. 2014లో వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడిచింది. ఆ చట్టం ప్రకారం బోర్డుతోపాటు జలవివాదాల పరిష్కారానికి కొత్త ట్రిబ్యునల్‌నూ ఏర్పాటు చేయాలి. రెండు రాష్ట్రాల మధ్య జలజగడాలను పరిష్కరించడానికి ఈ ట్రిబ్యునల్ తోడ్పడుతుంది. కానీ కేంద్ర ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. స్వార్థ రాజకీయాలతో మోడీ సర్కారు ట్రిబ్యునల్ ఏర్పాటును పెండింగ్‌లో పెట్టింది. కాగా రాజ్యాంగబద్దంగా తమ నీటి వాటాను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే అడుగుతున్నది. ఇందుకు అంతరాష్ట్ర జలవివాదాల చట్టంలోని సెక్షన్ మూడు కింద రాష్ట్ర ప్రభుత్వం ,కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఏదైనా ఒక రాష్ట్రం ఫిర్యాదు చేసిన ఏడాదిలోగా ఆ సమస్యను కేంద్రం పరిష్కరించాలి లేదా ట్రిబ్యునల్‌కు సిఫారసు చేయాలని చట్టంలోనే స్పష్టంగా ఉంది. ఇది దేశంలో ప్రస్తుతం అమలవుతున్న చట్టం. అయితే దీనిపై ఫిర్యాదు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. రాష్ట్రం ఏర్పడిన 42వ రోజే సెక్షన్ మూడు కింద జులై 14, 2014లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి ఫిర్యాదు చేసినట్టు అప్పటి రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మాజీ మంత్రి టి.హరీశ్‌రావు చెప్పారు. దీనిపై 2021, నవంబరు వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తప్పనిపరిస్థితుల్లో 13 నెలల తర్వాత, 2015 ఆగస్టులో రాష్ట్ర ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్టు తెలిపారు. కోర్టులో పిటిషన్ ఉన్నప్పటికీ నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి ఉన్నా, పట్టించుకోలేదని సాగునీటిరంగ అధికారులు, నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. పిటిషన్ ఉపసంహరించుకుంటేనే ట్రిబ్యునల్ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని చెప్పి ఇప్పుడు కాడేత్తేయడం గమనార్హం. ఈ మేరకు సుప్రీంకోర్టులో చెప్పాలనీ కేంద్ర జలశక్తి శాఖ ఒత్తిడి చేయడంతో బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. దీంతో న్యాయమార్గం సైతం మూసుకుపోయినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇది బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ద్రోహాం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అత్యంత దుర్మార్గం : సారంపల్లి మల్లారెడ్డి, సాగునీటిరంగ నిపుణులు
అత్యంత దుర్మార్గం. ఇది తెలంగాణను మోసం చేయడమే. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ గతంలో రెండుసార్లు రాష్ట్రానికి న్యాయం చేయలేదు. అపెక్స్ కౌన్సిల్‌కు, సుప్రీంకోర్టుకు ఒక మాట చెప్పి, మరోకటి చేయడం దారుణం. 75 శాతం జలాలకు బదులు 65 శాతమే తీసుకుంది. కర్నాటక, మహారాష్ట్రకు కేటాయించి తెలంగాణ జలాలను క్యారీఓవర్లో పెట్టాలే తప్ప, వాడుకోవద్దు అని చెప్పింది. కర్నాటక కరువు ప్రాంతాలను గుర్తించిన బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తెలంగాణలోని మహబూబ్‌నగర జిల్లా కరువు ప్రాంతాలను పట్టించుకోలేదు. ఇలా రెండురకాలుగా అన్యాయం చేసింది. ఆ ట్రిబ్యునల్ ద్వారా రాష్ట్రానికి న్యాయం జరగదు. కొత్త ట్రిబ్యునల్ అవసరం లేదనే కేంద్రం వాదనను ఖండిస్తున్నాం.
ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాల్సిందే : సాగునీటి శాఖ ఉన్నతాధికారి
బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ద్వారా న్యాయం జరగనందుకే కొత్త ట్రిబ్యునల్ అడిగాం. సెక్షన్ మూడు ప్రకారం కేంద్రానికి పదే పదే లేఖలు రాశాం. ఇప్పుడు కేంద్ర జలశక్తి శాఖ ఇలా మోసం చేయడం సరికాదు. అపెక్స్ కౌన్సిల్లో, సుప్రీంకోర్టులో చెప్పిన మాటను కేంద్రం తప్పుతున్నది. దీన్ని ఎంతమాత్రం సహించేది లేదు. ప్రభుత్వం పరంగా గట్టిచర్యలు తీసుకుంటామని పేరు రాయడానికి ఇష్టపడి ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. కేంద్రం చర్యతో రాష్ట్రానికి న్యాయమార్గం కూడా మూసుకుపోయినట్టేనని ఆవేదన వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టులో కేసు రీఓపెన్ చేయాలి : శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, రిటైర్డ్ ఇంజీనిర్
కేంద్రం నమ్మకద్రోహం చేస్తున్నది. ఆరోజు చెప్పింది ఒకటి, ఈరోజు చేస్తున్నది మరోకటి. అపెక్స్ కౌన్సిల్‌తోపాటు సుప్రీంకోర్టులో కేంద్ర జలశక్తిశాఖ చెప్పినదానికి భిన్నంగా వ్యవహారం చేస్తున్నది. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు కృష్ణా జలాల వివాదాన్ని అప్పగించాలా ? లేక కొత్త ట్రిబ్యునల్‌ను వేయాలా అనే అంశంపైనే న్యాయశాఖ సలహా కోరుతామని కేంద్ర జలశక్తి శాఖ చెప్పింది. కానీ, ఇప్పుడు కొత్త ట్రిబ్యునల్ అవసరమే లేదనడం సరికాదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు రీపెన్చేయాలి. కేంద్రం చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.