Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య
- సీపీఐ(ఎం), ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
నవతెలంగాణ-సిటీబ్యూరో/విలేకరులు
పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని, పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను రద్దు చేయాలని, కేంద్రం పెంచుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం), ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ర్యాలీలు, రాస్తారోకోలు చేట్టారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ ఆధ్వర్యంలో గోల్కొండ క్రాస్ రోడ్డులో చేపట్టిన నిరసనలో ఆయన పాల్గొని మాట్లాడారు. గృహ వినియోగదారులకు యూనిట్‌కు 50పైసలు చొప్పున, పరిశ్రమలకు యూనిట్‌కు రూపాయి చొప్పున రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ సంస్థ విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలపై తీవ్రమైన భారాలేసిందని, ఈ భారాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అనుసరిస్తూ కరోనాతో ఆర్థిక ఇబ్బందులెదుర్కొంటున్న ప్రజలపై భారాలు మోపుతోందన్నారు. డిస్కంలు పెట్టిన ప్రతిపాదనలను ఈఆర్సీ ఉన్నది ఉన్నట్టు ఆమోదించడమంటే ప్రతిపాదనలను సమగ్రంగా అధ్యయనం చేయకపోవడమేనని చెప్పారు. గృహ వినియోగదారులపై భారాలు మోపకుండా పెరిగిన చార్జీలను సబ్సిడీ రూపంలో ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. బహిరంగ మార్కెట్లో అతి తక్కువ ధరకు లభ్యమవుతున్న విద్యుత్‌ను కొనకుండా ఎక్కువ రేట్లకు కొనుగోలు చేస్తున్నారని, డిస్కంలపై పడే భారాలను ప్రజలపై వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, తక్కువ ధరలకు వచ్చే కంపెనీల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయాలని సూచించారు.
గతంలో టీడీపీ ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచి ప్రజల ఆగ్రహానికి గురైన విషయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించుకోవాలన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తక్కువగా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను భారీగా పెంచిందని, వీటిని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే గ్యాస్‌పై రూ.50 పెంచడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నరసింహారావు, టి.జ్యోతి, నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్, కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాస్‌రావు, కెఎన్.రాజన్న, కె.ఈశ్వర్రావు, ఎం.దశరథ్, ఎం.మహేందర్, కె.నాగలక్ష్మి, నగర కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం
హైదరాబాద్ సౌత్ కమిటీ ఆధ్వర్యంలో.. సంతోష్‌నగర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో నిరసన తెలిపారు. వీపనగండల మండల కేంద్రంలో ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు. కొల్లాపూర్ మండల కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. మిర్యాలగూడలో విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయం నుంచి నిర్మల్ హృదరు పాఠశాల వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సెంటర్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. తల్లాడలో ప్రధాన రహదారిపై నిరసన ర్యాలీ చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఇల్లందులో రాస్తారోకో చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వర్ని చౌరస్తాలోని విద్యుత్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.