Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కులాలు, మతాలకు చెందిన విగ్రహాలను బహిరంగ ప్రదేశాల్లో పెట్టొద్దని హైకోర్టు ఆదేశించింది. ఖమ్మంలోని ముత్యాలమ్మ సెంటర్లో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని పది రోజుల్లో తీసేయాలని కలెక్టర్‌ను ఆదేశించింది. గతంలో ఆదేశించిన తర్వాత శిలువను తీసేసి థెరిస్సా విగ్రహాన్ని పెడుతుంటే అధికారులు అడ్డుకోకుండా హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని వీహెచ్‌పీకి చెందిన అంజయ్య వేసిన రిట్‌ను శుక్రవారం హైకోర్టు విచారించింది. కలెక్టర్ గౌతం విచారణకు హాజరయ్యారు. పది రోజుల వ్యవధి ఇస్తే విగ్రహాన్ని తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ రికార్డుల్లో నమోదు చేసుకుని హామీ మేరకు చర్యల నివేదికను తదుపరి విచారణలో నివేదించాలని కలెక్టర్‌ను ఆదేశించింది.
క్యాట్ ఆదేశాల్ని కొట్టేయండి : హైకోర్టులో కేంద్రం వాదన
రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర సర్వీస్ అధికారులను ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు చట్ట ప్రకారమే జరిగాయని కేంద్రం హైకోర్టులో వాదించింది. కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ఆయా నియామకాలు జరిగాయని కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్‌రెడ్డి తెలిపారు. క్యాడర్ కేటాయింపులపై పూర్తి అధికారం కేంద్ర డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ)కే ఉందన్నారు. ఆ కేటాయింపులకు వ్యతిరేకంగా కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో (క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. క్యాట్ ఆదేశాల్ని కొట్టేయాలంటూ కేంద్రం దాఖలు చేసిన 15 రిట్లపై జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సూరేపల్లి నందలతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం విచారణ కొనసాగించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ను ఏపీకి నియమించడం సరైనదేనని ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ వాదించారు. క్యాట్ ఆదేశాల్ని కొట్టేయాలన్న కేంద్ర రిట్‌ను డిస్మిస్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. తదుపరి విచారణను కోర్టు ఈనెల 28కి వాయిదా వేసింది.
నూతన జడ్జీలకు బార్ అసోసియేషన్ సన్మానం
కొత్తగా నియమితులైన పది మంది హైకోర్టు న్యాయమూర్తులను రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్ శుక్రవారం అసోసియేషన్ హాల్లో సన్మానించింది. అధ్యక్షుడు పొన్నం అశోక్ గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కార్యదర్శి చెంగల్వ కల్యాణ్‌రావు స్వాగత వచనాలు పలికారు. నూతన న్యాయమూర్తులు జస్టిస్ కె. సురేందర్, జస్టిస్ ఎస్.నంద, జస్టిస్ కె.సుధీర్ కుమార్, జస్టిస్ జువ్వాడి. శ్రీదేవి, జస్టిస్ జి. అనుపమ చక్రవర్తి, జస్టిస్ ఎం.జి. ప్రియదర్శిని, జస్టిస్ సాంబశివరావు నాయుడు, జస్టిస్ ఎ. సంతోష్ రెడ్డి, జస్టిస్ డి. నాగార్జునలను సన్మానించారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి టి. సృజన్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షులు మహ్మద్ ముంతాజ్ పాషా పాల్గొన్నారు.