Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమ్కా డైరెక్టర్ మధుపరార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అధ్యాపకులకు సాంకేతిక పరిజ్ఞానం అత్యవసరమని కామన్వెల్త్ ఎడ్యుకేషనల్ మీడియా సెంటర్ ఫర్ ఆసియా (సెమ్కా) డైరెక్టర్ ప్రొఫెసర్ మధుపరార్ అన్నారు. సెంటర్ ఫర్ స్టాఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (బీఆర్ఏఓయూ), సెమ్కా సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో ఆన్లైన్ కెపాసిటీ బిల్డింగ్ ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యాపకులంతా బ్లెండెడ్ మోడ్‌లో విద్యాబోధన చేసేలా సంసిద్ధత సాధించడానికి ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు ఉపయోగపడతాయని చెప్పారు. అభ్యసనా పద్ధతులు, బోధనా పద్ధతులు మారాయనీ, విద్యార్థులను ఆకట్టుకునేలా పుస్తకాలను రూపొందించాలని సూచించారు. ఇలాంటి శిక్షణా కార్యక్రమాలకు సహకరించేందుకు సెమ్కా సిద్ధంగా ఉందన్నారు. విశిష్ట అతిధిగా హాజరైన ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి మాట్లాడుతూ ఉన్నత విద్యాసంస్థల్లో అధ్యాపకులు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవాల్సిన అవసరముందని చెప్పారు. అధ్యాపకులు సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ బోధనా పద్ధతులను అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఏఓయూ రిజిస్ట్రార్ జి లక్ష్మారెడ్డి, అధ్యక్షత వహించిన సెంటర్ ఫర్ స్టాఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఘంటా చక్రపాణి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ డి రవీంద్రనాథ్ సోలమన్ తదితరులు ప్రసంగించారు.
గవర్నర్‌ను కలిసిన అంబేద్కర్ వర్సిటీ, ఏఓసీ అధికారులు
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అకడమిక్ డైరెక్టర్ ఈ సుధారాణి, రిజిస్ట్రార్ జి లక్ష్మారెడ్డి, ఏఓసీ రెండో ట్రైనింగ్ బెటాలియన్ కమాండర్ కల్నల్ ప్రిన్స్ దత్తా, లెఫ్టినెంట్ కల్నల్ విరాజ్ సెంవెల్, సుబేదార్ మేజర్ బోర్కర్ కలిశారు. సికింద్రాబాద్‌లోని ఏఓసీ సెంటర్లో అంబేద్ వర్సిటీ లెర్నర్ సపోర్ట్ సెంటర్ ప్రారంభించడానికి వచ్చిన ఆమెను కలిసి ఆహ్వానించారు. ఇది ఒక మంచి పరిణామమంటూ గవర్నర్ అభివర్ణించారు. వచ్చేనెల ఏడో తేదీన ఏఓసీ సెంటర్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటానని వివరించారు.