Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - రామడుగు
కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2లో భాగంగా అదనపు టీఎంసీ కాలువ భూసేకరణ కోసం శుక్రవారం ఏర్పాటు చేసిన భూ సేకరణ గ్రామసభను గ్రామస్తులు బహిష్కరించారు. దీంతో రెవెన్యూ అధికారులు వెనక్కి వెళ్లారు. ఈ సందర్భంగా గ్రామసభకు వచ్చిన ఆర్డీవో ఆనంద్ కుమార్ను ఆర్డీవో గో బ్యాక్ అంటూ రైతులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. గతంలోనే 2004లో వరద కాలువలో ఇండ్లు, భూములు కోల్పోయామని.. మళ్లీ కాలేశ్వరం లింకు-2 అదనపు టీఎంసీ కోసం భూసేకరణ అవసరమా అంటూ ప్రశ్నించారు. భూములు కోల్పోతున్న రైతులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీతో పాటు, బహిరంగ మార్కెట్ విలువ ఉన్న గ్రామానికి సంబంధించిన రేటుకు మూడు రెట్లు కలిపి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా భూసేకరణలో కోల్పోయే షెడ్లు, వ్యవసాయ బావులు, మామిడి చెట్లను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. గతంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో అధికారులు భూసేకరణ వివరాలు చదివి వినిపించినప్పటికీ.. ప్రభుత్వం విడుదల చేసిన రెండో గెజిట్ నోటిఫికేషన్లో ఎందుకు తప్పించారని అధికారులను నిలదీశారు. రైతులకు మద్దతుగా టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. కేంద్ర జలశక్తి సంఘం, జాతీయ పర్యావరణ అనుమతులు లేకుండా అదనపు టీఎంసీ నిర్మాణాన్ని ఏవిధంగా నిర్మిస్తారని, భూ సేకరణ ఎలా చేస్తారని అధికారులను ప్రశ్నించారు. ఒకవేళ భూసేకరణ చేసినా బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం పరిహారాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామసభను జరుగనివ్వబోమంటూ రైతులతో కలిసి ఆందోళన చేయడంతో రెవిన్యూ అధికారులు వెనుతిరిగి వెళ్ళారు.