Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ-శ్రమ్ పథకంలో పేర్లను నమోదు చేయాలి
- కార్మికులంతా 28,29 తేదీల్లో సమ్మెను జయప్రదం చేయాలి
- తెలంగాణ రాష్ట్ర హమాలీ కార్మిక సంఘాల జేఏసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఈ నెల 28,29 తేదీల్లో జరగబోయే సార్వత్రిక సమ్మెను హమాలీ కార్మికులంతా జయప్రదం చేయాలని తెలంగాణ రాష్ట్ర హమాలీ కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. హమాలీ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలనీ, ఈ శ్రమ్ పథకంలో హమాలీల పేర్లను నమోదు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసింది. శుక్రవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జేఏసీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్. బాల్రాజ్, రాష్ట్ర కార్యదర్శి ముఖేష్ (ఏఐటీయూసీ), హమాలీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. సుధాకర్ (సీఐటీయూ), హమాలీ, మిల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి శివారపు శ్రీధర్ (ఐఎఫ్టీయూ), రాష్ట్ర కార్యదర్శి కె. సూర్యం (ఐఎఫ్టీయూ), తెలంగాణ ప్రగతిశిల హమాలీ, మిల్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సి. వెంకటేష్, జి. రామయ్య (ఐఎఫ్టియూ) మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అసంఘటితరంగ కార్మికుల సంక్షేమ బోర్డు విధి-విధానాలను ప్రకటించి కార్మికుల రద్దీ ప్రదేశాలలో నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.అసంఘటిత కార్మికుల సంక్షేమ భద్రత చట్టం-2008ని హమాలీలకు వర్తింప చేయలేదనీ, ఆయిల్ మిల్లు కార్మికులకు జి.ఓ. నెం.107, రైస్, ఫ్లోర్, దాల్ మిల్లు కార్మికులకు జి.ఓ. నెం.609, ట్రాన్స్పోర్టు హమాలీలకు జి.ఓ. నెం.618 లాంటి అరకొరగా ఉన్న చట్టాలు అమలుకు నోచుకోవడం లేదని పేర్కొన్నారు. పీస్ రేట్లతో బానిస చాకిరి చేయిస్తూ కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని విమర్శించారు. ఆ రేట్లను పెంచాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు తరహాలో హమాలీలకు ప్రయోజనాలు కలిగే చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ప్రభుత్వ గోదాముల్లో పనిచేస్తున్న హమాలీలను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం నిర్ణయించాలనీ, గుర్తింపు కార్డులు, ప్రమాద బీమా, ఈఎస్ఐ, పీఎఫ్ లాంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇండ్లు లేని పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలనీ, ఇండ్ల స్థలాలు లేని వారికి ప్రభుత్వమే స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.