Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆన్లైన్ బహిరంగ సభలో కార్మికులకు టీఎస్ఆర్టీసీ జేఏసీ పిలుపు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఈనెల 28,29 తేదీల్లో రెండ్రోజులపాటు జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు భాగస్వాములు కావాలని 9 కార్మిక సంఘాలతో కూడిన టీఎస్ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం జేఏసీ ఆధ్వర్యంలో ఆన్లైన్ బహిరంగ సభ నిర్వహించారు. జేఏసీ కమిటీ సభ్యులు పి రవీందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జేఏసీ కోశాధికారి గోపాల్ (ఎంప్లాయీస్ యూనియన్), వైస్ చైర్మెన్ కే హన్మంతు ముదిరాజ్ (టీజేఎమ్‌యూ), కన్వీనర్లు వీఎస్ రావు (టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్-ఎస్‌డబ్ల్యూఎఫ్), పీ కమాల్‌రెడ్డి (ఎన్‌ఎమ్‌యూ), కో కన్వీనర్లు జీ అబ్రహం (ఎస్‌డబ్ల్యూయూ), కే యాదయ్య (బీకేయూ), ఎస్ సురేష్ (బీడబ్ల్యూయూ), బీ యాదగిరి (కార్మిక పరిషత్) మాట్లాడారు. ''దేశాన్ని, దేశ ప్రజల్ని రక్షించండి'' నినాదంతో ఈ సమ్మె జరుగుతున్నదని చెప్పారు. కేంద్రం ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసే చర్యలకు పాల్పడుతున్నదనీ, ఆ రంగం వినాశనానికి గురయితే భవిష్యత్ తరాలు తీవ్రంగా నష్టపోతాయని హెచ్చరించారు. ఒకప్పుడు నష్టాలున్నాయనే సాకుతో ప్రభుత్వ సంస్థల్ని ప్రయివేటుకు అప్పగించేవారనీ, ఇప్పుడు లాభాలు వచ్చే ఎల్ఐసీ, రైల్వే, టెలికం, విద్యుత్, రక్షణ రంగాలను కూడా ప్రయివేటుపరం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఉద్యోగ, కార్మిక వర్గాలను తీవ్ర ఆందోళనల్లోకి నెట్టేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విధానాలను వ్యతిరేకిస్తున్నామని చెప్తూనే, రాష్ట్రంలో అదే అణచివేత ధోరణిని అవలంబిస్తున్నదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ధోరణిని రాష్ట్ర ప్రభుత్వం విడనాడాలని హితవు పలికారు. కార్మిక చట్టాలను నాలుగు కోడ్ల రూపంలోకి మార్చి, వాటిని అమలు చేయాలని కేంద్రం భావిస్తున్నదనీ, తక్షణం వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ వాడుతున్న డీజిల్ ధరలపై క్యాప్ విధించి, మిగిలిన భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో రెండు శాతం నిధులు కావాలని కోరితే పట్టించుకోలేదన్నారు. ఓవైపు రిటైర్మెంటు వయోపరిమితి పెంచి, స్వచ్ఛంద ఉద్యోగ విరమణ ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. అన్ని ప్రభుత్వశాఖల్లో కార్మిక, ఉద్యోగ సంఘాలను గుర్తిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో సంఘాలు లేవనడం లేబర్ కోడ్ల అమల్లో భాగమేనని విమర్శించారు. ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలపై కార్మిక లోకం తిరగబడాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆర్టీసీ కార్మికులంతా రెండ్రోజుల సమ్మెలో సంఘాలకు అతీతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆసిఫాబాద్ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తూ, యాజమాన్య వేధింపులతో ఒత్తిడికి గురై గుండెపోటుతో మరణించిన ఎమ్డీ గౌస్‌కు జేఏసీ ఆన్లైన్ బహిరంగ సభలో సంతాపం ప్రకటించారు. కార్మికులు మనోధైర్యాన్ని కోల్పోయే చర్యలకు యాజమాన్యం పాల్పడటం మానుకోవాలని హెచ్చరించారు.
సమ్మెలో పాల్గొనండి-ఎమ్ థామస్‌రెడ్డి
కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 28, 29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీ కార్మికులు పాల్గొనాలని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎమ్ థామస్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సమ్మెకు తమ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. ఆర్టీసీలోని అన్ని స్థాయిల కార్మికులు ఈ ఆందోళనలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రజా రవాణా బిల్లును ఉపసంహరించుకోవాలనీ, ప్రయివేటీకరణ విధానాలను విడనాడాలనీ, బల్క్ డీజిల్‌పై గతంలో మాదిరే సబ్సిడీ కొనసాగించాలని డిమాండ్ చేశారు.