Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయంలో వారి పాత్ర కీలకం : రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మహబూబాబాద్
రైతాంగ, ప్రజాఉద్యమాల్లో మహిళల పాత్ర పెరగాలని, వ్యవసాయంలో వారి పాత్ర కీలకమని.. అలాగే అన్నింటా ఉండాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి, మల్లు స్వరాజ్యం, చాకలి ఐలమ్మ తదితర వీరవనితల స్ఫూర్తితో మహిళలు ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన మహిళా రైతుల రాష్ట్ర సదస్సులో రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పోతినేని సుదర్శన్, సాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి మొదలుకొని సమాజంలో మహిళల పాత్ర కీలకంగా నిలుస్తోందని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని తెలిపారు. సంపద సృష్టిలోనూ మహిళల పాత్ర క్రియాశీలకమని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంలో విత్తనాలు చల్లడం నుంచి అన్ని పనుల్లోనూ మహిళల శ్రమ మరువలేనిదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మహిళా, కౌలు రైతులకు అన్యాయం చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. రైతు వ్యతిరేక చట్టాల రద్దు కోసం ఏడాదిపాటు సాగిన రైతాంగ పోరాటం సందర్భంగా 750 మంది రైతులు ప్రాణం కోల్పోయారని గుర్తుచేశారు. చలిలో, మండుటెండలో, రాత్రింబవళ్లు ఢిల్లీ రోడ్లపై జరిగిన ఆందోళనలో మహిళలు సైతం పెద్దఎత్తున పాల్గొన్నారని తెలిపారు. కేంద్రం పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం వల్ల దేశవ్యాప్తంగా వేలాది మంది రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం చేయాలన్న స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని, కౌలు రైతులకు అదనంగా ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ పోరాటాల్లో మహిళల భాగస్వామ్యం ఇంకా పెరగాలన్నారు. సదస్సులో సంఘం మహిళా విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదినేని లక్ష్మి, వివిధ జిల్లాల బాధ్యులు బానోత్ కుమారి, నాగలక్ష్మి, బొబ్బ లక్ష్మి, ఐద్వా జిల్లా అధ్యక్షులు కందునూరి కవిత, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్నాయక్, నాయకులు వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గునిగంటి రాజన్న, శెట్టి వెంకన్న పాల్గొన్నారు.