Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాణాలతో తప్పించుకున్న ఇద్దరు వ్యక్తులు
- మృతదేహం కోసం పోలీసులు గాలింపు
- అంతు చిక్కని మిస్టరీగా మిగిలిన వైనం
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వేటకు వెళ్లిన వ్యక్తి మరొక వేటగాళ్ళు అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం సంచలనం రేపింది. చుంచుపల్లి మండలం, పెనుబల్లి అటవీ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటనలో పోలీసులు ఉదయం నుంచి అటవీ ప్రాంతంలో మృతదేహం కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. డాగ్‌స్వ్కాడ్ కూడా ఎలాంటి ఆధారాలను పసిగట్టలేకపోయాయి. మృతదేహం లభించకపోవడం మిస్టరీగా మారింది.
వివరాల్లోకి వెళితే....కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని సన్యాసి బస్తీకి చెందిన మల్లెల సునీల్(47) ప్రయివేటు ఎలక్ట్రిషన్‌గా పని చేస్తున్నారు. ఇతనికి తరచూ
అటవీ జంతువులకోసం వేటకు వెళ్లడం అలవాటు. రుద్రంపూర్, రామవరం ప్రాంతానికి చెందిన వెంకన్న, లావుడియా మున్నాలతో కలిసి తరచూ వేటకి వెళ్తాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఖమ్మం పెండ్లికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన సునీల్.. శుక్రవారం ఉదయం అతని మరణ వార్త తెలిసింది. పెనుబల్లి అటవీ ప్రాంతంలో మరికొంత మంది వేటగాళ్ళు అడవి జంతువుల కోసం అమర్చిన విద్యుత్ తీగలకు సునీల్ ప్రాణాలు బలిగొన్నాయి. జంతువుల వేటకు అమర్చిన హై టెన్షన్ పవర్ విద్యుత్ తీగలు సునీల్‌కు తగలగానే పెద్ద ఎత్తున మంటలు వచ్చి శరీరం కాలిందని, స్నేహితులు వెంకన్న, మున్నా తెలిపారు. భయాందోళనకు గురైన వారు సునీల్ మృతదేహాన్ని అడవిలో విడిచి పెట్టి రామవరంలోని టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు. జరిగిన విషయాన్ని వివరించారు. కొత్తగూడెం1 టౌన్, 2 టౌన్ సీఐలు సత్యనారాయణ, రాజు తమ బృందంతో అటవీ ప్రాంతంలోకి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. ఫలితం లేకపోవడంతో డాగ్‌స్క్వాడ్ పిలిపించారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం దక్కలేదు. సంఘటనా స్థలాన్ని కొత్తగూడెం ట్రైనీ ఐపీఎస్ క్రాంతి రానా పటేల్, డీఎస్పీ వెంకటేశ్వర బాబు పరిశీలించారు. పొద్దుపోయే వరకూ గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ మృతదేహం లభించలేదు. ఈ సంఘటనపై పోలీసులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. సంఘటనా స్థలంలో విద్యుత్ తీగలు లేకపోవడం, సునీల్ మృతదేహం లభించకపోవడం మిస్టరీగా మారింది. దీన్ని ఛేదించేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.