Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారమివ్వాలి
- నిబంధనలు పాటించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి
- రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి సీఐటీయూ బృందం వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వలస కార్మికుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. బోయగూడ ప్రమాదంలో మరణించిన 11 మంది బీహార్‌కు చెందిన వలస కార్మికులకు రూ.50 లక్షల పరిహారమివ్వాలని కోరింది. నిబంధనలు పాటించని పరిశ్రమల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి సీఐటీయూ బృందం వినతిపత్రాన్ని అందజేసింది. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శులు ఎస్వీ రమ, బి.మధు, ఎం.వెంకటేశ్, రాష్ట్ర కమిటీ సభ్యులు వై.సోమన్న పాల్గొన్నారు. అనుమతుల్లేని గోడౌన్లు హైదరాబాద్‌లో చాలా ఉన్నాయనీ, వాటి పట్ల రాష్ట్ర సర్కారు మౌనంగా ఉంటే ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బోయగూడ ప్రమాదానికి యాజమాన్యం నిర్లక్ష్యం కూడా కారణమేనన్నారు. గతంలో విశాఖ పట్నం ఎల్జి పాలిమర్స్ ప్రమాదంలో మరణించిన కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కొక్కరి రూ.కోటి ఎక్స్‌గ్రేషియో ప్రకటించిందని గుర్తుచేశారు. అందువల్ల బోయగూడ అగ్ని ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించి, చెల్లించాలని కోరారు. అంతరాష్ట్ర్ర వలస కార్మికుల చట్టం (ఐఎస్ఎండబ్ల్యూ) 1979 ప్రకారం వలస కార్మికుల బాధ్యతలను యాజమాన్యాలే తీసుకోవాలనీ, వలస కార్మికుల పేర్లను రిజిష్ట్రేషన్, వారు పనిచేస్తున్న పరిశ్రమల రిజిస్ట్రేషన్, వారిని పనుల కోసం తీసుకువస్తున్న కాంట్రాక్టర్ల లైసెన్స్‌లు తదితర వివరాలు ప్రభుత్వం నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో పాత్ర పోషిస్తున్న వలస కార్మికుల సంక్షేమం, భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సూచించారు. నిబంధనలను పాటించని పరిశ్రమల యాజమాన్యాలపై పర్యవేక్షణ చేయాల్సిన కార్మిక శాఖ అధికారులు పట్టించుకోవట్లేదనీ, ఫలితంగానే ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయని వివరించారు.
ఘటనాస్థలిని సందర్శించిన సీఐటీయూ బృందం
11 మంది వలస కార్మికులు చనిపోయిన బోయగూడలో స్క్రాప్ గోడౌన్‌ను సీఐటీయూ రాష్ట్ర బృందం శుక్రవారం సందర్శించింది. గోడౌన్లో తిరిగి పరిశీలించింది. ఈ సందర్భంగా సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు మాట్లాడుతూ..వలస కార్మికుల చట్టాన్ని అమలు చేయడంలో రాష్ట్ర సర్కారు పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ఇప్పటికైనా వలస కార్మికులు ఎంత మంది ఉన్నారు? ఏ పరిశ్రమలో పనిచేస్తున్నారు? యాజమాన్యాల దగ్గర రిజిష్ట్రర్లు ఉన్నాయా? లేదా? వారికి వసతి, వేతనాలు ఎలా ఉన్నాయి? తదితర వివరాలను రాష్ట్ర సర్కారు సేకరించాలని సూచించారు. నిబంధనలు పాటించని గోడౌన్ల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.