Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెట్ కన్వీనర్ రాధారెడ్డి
- నేటినుంచి దరఖాస్తుల స్వీకరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకానికి జూన్ 12న నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాసేందుకూ డీఎల్ఈడీ, బీఎడ్ చివరి సంవత్సరం విద్యార్థులూ రాసేందుకు అవకాశముందని రాష్ట్ర విద్యా, పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్, టెట్ కన్వీనర్ ఎం రాధారెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి గురువారం నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. శుక్రవారం తనను కలిసిన విలేకర్లతో ఆమె మాట్లాడుతూ టెట్ పూర్తి సమాచార బులెటిన్, సిలబస్‌ను విడుదల చేశామని వివరించారు. 2017లో నిర్వహించిన టెట్ సిలబస్ ప్రకారమే ఈ పరీక్షలను నిర్వహిస్తామని చెప్పారు. పేపర్-1 లేదా పేపర్-2 లేదా రెండింటికీ కలిపి రూ.300 ఫీజు చెల్లించామని వివరించారు. శనివారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. వాటి సమర్పణకు తుదిగడువు వచ్చేనెల 12వ తేదీ వరకు ఉందన్నారు. ఆన్లైన్లో ఈనెల 26 నుంచి వచ్చేనెల 11వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశముందని తెలిపారు. జూన్ 12న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరుగుతాయని వివరించారు. అదేనెల 27న ఫలితాలు ప్రకటిస్తామని అన్నారు. టెట్‌కు సంబంధించి శనివారం నుంచి హెల్ప్‌డెస్క్ ప్రారంభిస్తామని చెప్పారు. 150 మార్కులకు ఈ పరీక్షను నిర్వహిస్తామన్నారు. టెట్‌లో జనరల్ అభ్యర్థులకు 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ,ఎస్టీ, వికలాంగులకు 40 శాతంపైగా మార్కులు వస్తే ఉత్తీర్ణులుగా ప్రకటిస్తామని వివరించారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల ఉపాధ్యాయ నియామక పరీక్షలో 20 శాతం మార్కులు వెయిటేజీ ఉంటుందన్నారు. పూర్తి వివరాల కోసం https://tstet.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.