Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాసంగి ధాన్యం కొనుగోళ్ల చుట్టే రాజకీయం
- మరుగున పడుతున్న అన్నదాతల ఇతర సమస్యలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో రైతులను ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. సాగు కోసం రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. అంతా పచ్చగా కనిపిస్తున్నప్పటికీ, వారి చుట్టూ సమస్యల కంచెలు అల్లుకుంటున్నాయి. ఈ క్రమంలో యాసంగి వరి కొనుగోలు అంశాన్ని టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రధాన ఎజెండాగా చేసుకుంటున్నాయి. తద్వారా రైతులు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలను మరుగుపర్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. కేంద్రం ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ డిమాండ్ చేస్తుండగా, కేంద్రం కొనబోదని ఎన్నడూ చెప్పలేదనీ, ఉద్దేశపూర్వకంగానే టీఆర్ఎస్ బురదజల్లుతున్నదంటూ బీజేపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. మధ్యలో కాంగ్రెస్ కూడా కేంద్రాన్ని ప్రశ్నించకుండా చోద్యం చూస్తున్నది. యాసంగి వరి ధాన్యం ఇంకా చేతికే రాలేదు. అయినా మూడు పార్టీలు తమ రాజకీయ ఎజెండాను వడ్ల చుట్ట తిప్పుతూ రైతులను తప్పుదోవపట్టిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
నాణ్యమైన విత్తనాలు..సరిపడ ఎరువులేవి?
వానాకాలంలో రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు తెరపైకి రావడం లేదు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, రుణ సౌకర్యాన్ని కల్పించడంతో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతున్నది. గత ప్రభుత్వాలు సబ్సిడీపై విత్తనాలు, సబ్సిడీ ఎరువులు, విత్తన సరఫరాలను రైతులకు అందుబాటులో ఉంచేవి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎకరాకు రూ 10వేల 'రైతుబంధు' పథకం అమలు పేరుతోఅన్నదాతకు రైతుకు అందాల్సిన ఇతర సౌకర్యాలకు కోత పెట్టింది. దీంతో ప్రయివేటు కంపెనీలు విత్తనాలను అధిక ధరలకు రైతులకు విక్రయిస్తున్నాయి. కేంద్ర బడ్జెట్లో ఎరువులకు భారీగా కోత పెట్టింది. దీని ఫలితంగా వాటిని ధరలు పెరిగి, రైతులపై తీవ్రమైన భారం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రైతుపై నేరుగా ఆర్థిక భారం పడే పలు అంశాలను ఈ మూడు పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. అదే క్రమంలో వరి కొనుగోళ్ల అంశాన్ని తీసుకుని ఇటు హైదరాబాద్‌లోనూ, అటు ఢిల్లీలో రాజకీయం చేస్తున్నాయి. పంట నేలలను 'సాయిల్ టెస్టు' నిర్వహించి, ప్రతి రైతుకు కార్డు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటికీ ఆ ప్రక్రియ పూర్తి చేయలేదు. దీంతో రైతులు ఎరువులు అధిక మొతాదులో ఉపయోగిస్తున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాటిని వినియోగంపై రైతులకు సరైన అవగాహన కల్పించడంతో సర్కారు విఫలమవుతున్నది.
పాలీహౌస్ గాలికి...ఆయిల్ఫామ్ నత్తనడక
రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆర్భాటంగా ప్రవేశ పెట్టిన పాలీహౌస్ పథకాన్ని రెండేండ్లలోనే నిర్వీర్యం చేసింది. ఈ పథకంతో ఆయా కంపెనీలు బాగుపడ్డాయి తప్ప రైతులకు మేలు జరగలేదనే విమర్ళలున్నాయి. ఆయిల్‌పామ్ సాగు పేరుతో పెద్ద పెద్ద భూస్వాములకు ఉపయోగపడేలా ఆయిల్‌పామ్ సాగు పథకాన్ని తీసుకొచ్చింది. 22 లక్షల ఎకరాల్లో సాగు చేసేందుకు పథకాన్ని రూపొందించింది. దీనికి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని నిపుణులు అంటున్నారు. చిన్న, సన్నకారు రైతులకు ఎంతో మేలు చేసే బిందుసేద్యాన్ని అమలు చేయడం లేదు. ఇటీవల తామర వైరస్ సోకి మిర్చి పంటదెబ్బతిన్నది. దీంతో ఆర్థికంగా కోలుకోలేని పరిస్థితి తలెత్తడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పంటల మార్పిడి అంటూ రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేసింది. కానీ ఆయా పంటలకు ఇప్పటికీ మద్దతు ధర కల్పించలేదు. ఇత్యాది సమస్యలను గాలికొదిలేసి, ఒకే అంశాన్ని ప్రస్తావిస్తూ.. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ రైతులను తప్పుదోవపట్టిస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి.